వారి మనోభావాలు తెలుసుకొంటాం
ఐదేళ్లు ప్రజల పక్షాన పోరాడతాం
మళ్లీ ప్రజాభిమానాన్ని సంపాదించుకుంటాం
8న ఘనంగా వైఎస్సార్ జయంతి ఉత్సవాలు
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని ఈ నెల 8న ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. గురువారం ఎండాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, డిప్యూటీ రీజనల్ కో–ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి, నగర మేయర్ హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, సమన్వయకర్త కె.కె.రాజు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం అమర్‌నాథ్, వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, ప్రతి వార్డులో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను సమీక్షిస్తున్నామని, వచ్చే వారం నుంచి పార్టీ నాయకులు, శ్రేణుల మనోభావాలు తెలుసుకుంటారని చెప్పారు. త్వరలోనే పార్టీ జిల్లా, నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహిస్తామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల అయిందని, మరో 4 నెలలు పాలనా విధానాన్ని పరిశీలించి ఆ తర్వాత మాట్లాడతామని చెప్పారు. తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, తిరిగి వారి అభిమానాన్ని సంపాదిస్తామని అన్నారు. ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకొని, దానికి అనుగుణంగా పార్టీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తల ఆలోచనలు, సమస్యలను తెలుసుకొని, పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి మనోభావాలకు అనుగుణంగానే పని చేస్తామన్నారు. 2019కి ముందు జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన ప్రతి అంశాన్ని మళ్లీ అమలు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment