ఆరిలోవ(విశాఖ తూర్పు): పచ్చని అరణ్యాలు పలుచపడుతున్నాయి. కొండలు జనావాసాలుగా రూపాంతరం చెందాయి. దీంతో అరణ్యంలో ఉండాల్సిన వన్య ప్రాణులు జనారణ్యంలోకి ప్రవేశించి ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని జంతు జాతులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. అందుకే వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అటవీ శాఖాధికారులు, జంతు సంరక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 4(శనివారం)న ప్రపంచ వన్య ప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
విశాఖ నగరంలో జనసాంద్రత విపరీతంగా పెరిగింది. భారీగా నివాసాల కొరత ఏర్పంది. స్థలాల ధర చుక్కలను తాకుతోంది. దీంతో పేద జనం అడవులు, కొండలను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. విశాఖ నగరాన్ని ఆనుకొని ఉన్న కొండలు జనావాసాలతో కిక్కిరిసిపోయాయి. కంబాలకొండ, సీతకొండ, ఎర్రకొండ, ఎండాడ కొండలు, అమనాం ప్రాంతాల్లో దట్టమైన రిజర్వ్‌డు ఫారెస్టుకు చెందిన కొండలున్నాయి. వీటిలో కంబాల కొండలో 17,600 ఎకరాలు, సీతకొండలో 800, ఎర్రకొండలో 800, అమనాం ప్రాంతంలో 920 ఎకరాల విస్తార్ణంలో అడువులుండేవి.
కొన్నేళ్లుగా ఆ అడవులు ఆక్రమణకు గురై విస్తీర్ణం తరిగిపోయింది. ఒకప్పుడు సుమారు 1,000 ఎకరాల్లో రుషికొండ ప్రాంతంలో కొండలుండేవి. వీటిలో ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు, ఫిల్మ్‌సిటీ వెలిశాయి. దీంతో అక్కడ అటవీ ప్రాంతమంతా కనుమరుగైంది. ఈ కొండలన్నింటిలోను సుమారు 8 చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అప్పట్లో గుర్తించారు. ఎండాడ కొండల్లో నాలుగు చిరుతలు సంచరించేవని, ఇక్కడ నిర్మాణాలు జరగడంతో వాటి జాడ కనిపించలేదు. చిరుతలకు ఆహారమైన జింకలు, కనుజులు, నక్కల సంఖ్య కూడా తగ్గతుందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
దీంతో ఆహారం కోసం చిరుతలు జనారణ్యంలోకి చొరబడుతున్న సందర్భాలు ఉన్నాయి. చిరుతలు అడవుల్లో సుమారు 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సంచరిస్తాయి. సీతకొండ, ఎర్రకొండ, అమనాం ప్రాంతాలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. దీంతో రాత్రివేల ఆహారం కోసం చిరుతలు తిరుగుతూ అడవులు సమీపంలోని నివాసాలలోకి చొరబడుతున్నాయి. గతంలో అమనాం, ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం, అక్కయ్యపాలెం, మధురవాడ ప్రాంతాల్లో చిరుతలు ఆహారం కోసం జనారణ్యంలోకి వచ్చి ఇళ్లలోకి చొరబడిన సంఘటనలు తెలిసిందే.
2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం వన్యప్రాణులను సంరక్షించాలనే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా సీఐటీఈఎస్ అనే సంస్థ 2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోను అటవీశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జంతువుల ఆవాసాలను రక్షించడం, వన్యప్రాణులను వేటాడం చేయకుండా చూడడం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందిరాగాంధీ జూలో వరుసగా రెండేళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయింది. 2020లో కరోనా కారణంగా నిర్వహించలేకపోయింది.
ప్రస్తుతం తుపాన్ కారణంగా జూలో అధికారులు వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేకపోయారు. విశాఖ జూలో వన్యప్రాణులు నగరంలో 625 ఎకరాల అటవీ విస్తీ్తర్ణంలో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్కులో అనేక రకాల వన్యప్రాణులున్నాయి. ఇక్కడ వివిధ రకాలకు చెందిన సుమారు 830 వన్యప్రాణులు కనువిందు చేస్తున్నాయి. రామచిలుకలు, ఆఫ్రికన్ చిలుకలు, మైనాలు, ఆస్ట్రిచ్‌లు, ఈమూలు, రంగురంగుల పిట్టలతో పాటు పులులు, సింహాలు, ఏనుగులు,
నీటి ఏనుగులు, ఖడ్గమృగం, జిరాఫీలు, జీబ్రాలు, చింపాంజీలు, కనుజులు, జింకలు, కొండగొర్రెలు, అడవి కుక్కలు, హైనాలు తదితర వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తున్నారు.
వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత
వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. జూకి వచ్చిన సందర్శకులు సరదాగా వినోదం కోసం మాత్రమే వన్యప్రాణులను చూడాలనుకోకూడదు. వాటి జీవన విధానం, పర్యావరణంలో వాటి ఆవశ్యకత గరించి తెలుసుకోవాలి. ప్రతి ఏడాది జూలో వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తుంటాం. అయితే ఈ ఏడాది తుపాను కారణంగా జూకి సెలవు ప్రకటించడంతో జరుపుకోలేకపోతున్నాం. అందరూ వన్యప్రాణులను సంరక్షించడానికి కృషి చేయాలి. వాటిపై ప్రేమ చూపాలి. వాటి ఆవాసాలలోకి చొరబడకుండా ఉండాలి. ప్రస్తుం మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. మిగిలిన జంతు జాతి అంతరించిపోకుంగా చూడాలి.
–నందని సలారియా, జూ క్యూరేటర్.
Comments
Please login to add a commentAdd a comment