రూ.1,500 సాయం కోసం ఆశగా అక్కచెల్లెమ్మల ఎదురు చూపులు
ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు
పింఛనుదార్లను మినహాయించినా.. 1.72 కోట్ల మంది మహిళలు సాయానికి అర్హులే
డబ్బులందక ఇప్పటికే జూన్‌లో రూ.2,588 కోట్లు నష్టపోయిన వైనం
పోనీ భవిష్యత్తులోనైనా బకాయిలతో కలిపి చెల్లిస్తారా?.. ఇంటింటా ఆందోళన
19 – 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెలా ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం
ఏడాది ముందే చంద్రబాబు సంతకంతో ఇంటింటికీ గ్యారెంటీ కార్డుల పంపిణీ
బాబు రావటమే ఆలస్యం.. ‘ఆడబిడ్డ నిధి’ నుంచి ఇస్తారంటూ నమ్మబలికిన టీడీపీ నేతలు.. 2014లో రైతన్నలకు, పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలూ తుంగలోకి..
బాబు హామీల అమలుకు తనది గ్యారంటీ అని చివరకు మొహం చాటేసిన జనసేనాని
సాక్షి, అమరావతి: కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందచేస్తామన్న సీఎం చంద్రబాబు ఇంతవరకూ ఆ హామీ అమలు ఊసే ఎత్తకపోవడం, తొలి సంతకాలలో ఆ ప్రస్తావనే లేకపోవడం, ఇప్పటికే జూన్‌లో సాయం అందక నష్టపోయిన నేపథ్యంలో కనీసం బకాయిలతో కలిపి అయినా చెల్లిస్తారా? అనే ఆందోళన కోట్లాది మంది అక్కచెల్లెమ్మల్లో వ్యక్తమవుతోంది.
19 – 59 ఏళ్ల వయసు మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకుంటామని టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగళంలో హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య, వితంతు తదితర పింఛన్లు తీసుకుంటున్న దాదాపు 38 లక్షల మంది మహిళలను మినహాయించినా కూటమి మేనిఫెస్టో ప్రకారం 1.72 కోట్ల మందికిపైగా అక్క చెల్లెమ్మలు రూ.1,500 చొప్పున ప్రతి నెలా సాయం పొందేందుకు అర్హులని స్పష్టమవుతోంది.
ఈ హామీ అమలులో జరుగుతున్న జాప్యంతో అక్కచెల్లెమ్మలు నెలకు రూ.2,588 కోట్ల చొప్పున ఏడాదికి రూ.31,065 కోట్లు దాకా నష్టపోతున్నారు. జూన్‌లో ఇప్పటికే రూ.2,588 కోట్లు నష్టపోయారు. పోనీ భవిష్యత్తులో ఇచ్చే డబ్బులు బకాయిలతో కలిపి ఇస్తారా? అనే అనుమానాలు మహిళల్లో వ్యక్తమవుతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి ‘ఆడబిడ్డ నిధి’ నుంచి నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈమేరకు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ – ఇది బాబు ష్యూరిటీ’ పేరుతో ఇంటింటికీ చంద్రబాబు సంతకంతో కూడిన కరపత్రాలను పంచారు.
అధికారం దక్కించుకునేందుకు ఎడాపెడా హామీలు గుప్పించిన కూటమి నేతలు హామీల అమలుపైనా అంతే ఉత్సాహం చూపాలని ప్రజానీకం కోరుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ – జనసేన– బీజేపీ కూటమిగా పోటీ చేసినా కమలనాథులతో సంబంధం లేకుండా సూపర్ సిక్స్ పేరిట టీడీపీ, షణ్ముఖ వ్యూహం పేరుతో జనసేన రూపొందించుకున్న అంశాలతో ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఏడాది ముందే బాబు సంతకంతో గ్యారెంటీ కార్డులు..
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ప్రతి ఇంటికీ తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున సాయంతోపాటు సూపర్ సిక్స్‌లోని అన్ని అంశాలను కచ్చితంగా అమలు చేస్తారని నమ్మబలుకుతూ ‘గ్యారెంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని, తమను గెలిపించాలని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతి బహిరంగ సభలోనూ చంద్రబాబు అభ్యర్థించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ అమలుకు తనది గ్యారంటీ అని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సైతం ఎన్నికల ప్రచార సభల్లో, రాజకీయ వేదికలపై ప్రకటించారు.
ఎన్నికలు ముగిసి చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్‌కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో కొనసాగుతున్న నేపథ్యంలో జాప్యం చేయకుండా మేనిఫెస్టో హామీలను నెరవేర్చి తమకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని మహిళలు కోరుతున్నారు.
1.72 కోట్ల మంది నిరీక్షణ..
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఓటర్లుగా నమోదైన వారిలో 19–59 ఏళ్ల వయసు మహిళలంతా చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి నెలా రూ.1,500 చొప్పున పొందేందుకు అర్హులేనని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పింఛన్లు పొందుతున్న మహిళలను మినహాయించినా 1.72 కోట్ల మందికిపైగా ఈ పథకానికి అర్హులేనని పేర్కొంటున్నారు. హామీ అమలులో ఆలస్యం కారణంగా వారంతా ప్రతి నెలా రూ.2,588 కోట్ల చొప్పున నష్టపోతున్నారని గుర్తు చేస్తున్నారు.
నాడు మొహం చాటేసిన జనసేనాని
ఎన్నికల హామీలను చంద్రబాబు – పవన్‌కళ్యాణ్ అమలు చేస్తారా? లేదంటే 2014 తరహాలో మరోసారి మోసం చేస్తారా? అనే చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. 2014లోనూ టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యతను నెత్తికెత్తుకున్నానని, అమలు చేయకుంటే నిలదీసే బాధ్యత తనదేనంటూ నమ్మకంగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత మొహం చాటేసిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబును నాడు జనసేనాని కనీసం ప్రశ్నించని వైనాన్ని ప్రస్తావిస్తున్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే రైతు రుణాల మాఫీతోపాటు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నాడు కుప్పలు తెప్పలుగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా నిలువునా వంచించిన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకంగా మేనిఫెస్టోను సైతం టీడీపీ వెబ్‌సైట్ నుంచి మాయం చేయడం గమనార్హం.
డ్వాక్రాకు ద్రోహం..
బేషరతుగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఐదేళ్లలో 70 లక్షల మందికి పైసా కూడా మాఫీ చేయకపోవడంతో పొదుపు సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్‌పీలు (నిరర్థక ఆస్తులు)గా మిగిలాయి. సంఘాలు రుణాలు కట్టకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలిచ్చేందుకు నిరాకరించాయి. నాడు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత తమ ప్రభుత్వం డ్వాక్రా రుణహామీని అమలు చేయలేదని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించడం గమనార్హం.
అన్నదాతకు వెన్నుపోటు..
2014 ఎన్నికల నాటికి రాష్ట్రంలో రైతుల పేరిట రూ.8,7612 కోట్లు వ్యవసాయ రుణాలు ఉండగా కోటయ్య కమిటీ పేరుతో కాలయాపన చేసిన చంద్రబాబు కోతలు వేసి విడతలవారీగా అంటూ అరకొర మాఫీతో సరిపుచ్చారు. రైతు సాధికారికత పేరుతో టీడీపీ సర్కారు ఇచ్చిన రుణ బాండ్లు చెల్లుబాటు కాక చిత్తు కాగితాల్లా మిగిలిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment