సీఎం జగన్‌ వల్లే మహిళా సాధికారత | Women MLAs says women empowerment in AP by CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ వల్లే మహిళా సాధికారత

Published Fri, Nov 19 2021 3:37 AM | Last Updated on Fri, Nov 19 2021 7:47 AM

Women MLAs says women empowerment in AP by CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సాధికారత సీఎం జగన్‌ వల్లే సాధ్యమవుతోందని పలువురు మహిళా ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రతి అడుగులోనూ సీఎం వైఎస్‌ జగన్‌ మహిళలకు ఓ అన్నలా అండగా నిలబడుతున్నారని కొనియాడారు. గురువారం అసెంబ్లీలో ‘మహిళా సాధికారత’ అంశంపై జరిగిన చర్చలో మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడారు. చంద్రబాబు మహిళలను నమ్మించి మోసం చేస్తే.. సీఎం జగన్‌ అడుగడుగునా అండగా నిలబడ్డారన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ప్రతి ఇంటిలో పొయ్యి వెలిగిందంటే సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణమని చెప్పారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. 

సామాజిక స్వాతంత్య్రం దిశగా.. 
మహిళల సంక్షేమం ద్వారానే సామాజిక స్వాతంత్య్రం సాధ్యమని సీఎం వైఎస్‌ జగన్‌ నమ్మారు. ఈ దిశగానే వివిధ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తున్న మనసున్న మహారాజు ఆయన. 
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌ 
 
సొంతంగా మహిళల ఎదుగుదల కోసం..  
మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తామే నిలబడి ఎదగాలని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి మహిళ సీఎం జగన్‌ తమకు అన్నలా అండగా ఉన్నారన్న ధైర్యంతో ఉన్నారు.  
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజిని 

ఒకేసారి 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు 
రాష్ట్రంలో ఇళ్లు లేని పేద కుటుంబాల్లో 30 లక్షల మంది మహిళలకు వారి పేరుతోనే ఇళ్ల పట్టాలిచ్చిన ఘనత సీఎం జగన్‌ సొంతం. ఆయన మహిళల్లో కొత్త ఆత్మస్థైర్యాన్ని నింపారు. అనేక ఒడిదుడుకులు, కరోనా కష్టాల మధ్య కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. 
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, విశ్వాసరాయ కళావతి 

ఓ వెల్లువలా మహిళా సాధికారత 
గత రెండున్నరేళ్లుగా మహిళా సాధికారత కోసం ఓ వెల్లువలా, విప్లవంలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అందరికీ ఓ అన్నలా సీఎం వైఎస్‌ జగన్‌ నిలబడ్డారు.  
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ 

ప్రభుత్వం ఇంకా మంచి చేయాలి 
మహిళల అభివృద్ధికి టీడీపీ ఎంతో కృషి చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేస్తోంది. అవి మహిళలకు అందుతున్నాయి. ఈ ప్రభుత్వం ఇంకా మంచి బాగా చేయాలి. మద్యపాన నిషేదాన్ని పూర్తిగా చేయాలి. 
 టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ    

చంద్రబాబు మహిళలకు శఠగోపం పెట్టారు.. 
2014 అసెంబ్లీ ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మహిళలకు ఎలా శఠగోపం పెట్టాడో చూశాం. మహిళలకు ఆకాశమంత అండగా సీఎం వైఎస్‌ జగన్‌ ఉంటున్నారు. ఆయన చేపడుతున్న అభివృద్ధి పనులకు చంద్రబాబు ఆటంకాలు సృష్టించాలని చూస్తే అడ్రస్‌ లేకుండా పోవడం ఖాయం.  
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి  

బెల్టుషాపులను తొలగించారు.. 
వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే 43 వేల బెల్ట్‌షాపులను తొలగించారు. అక్రమ మద్యం అమ్మకాలను నిర్మూలించడానికి సచివాలయాల్లో ప్రత్యేకంగా మహిళా సంరక్షణాధికారులను నియమించారు.  
–వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కె.శ్రీదేవి  

మాటల్లో కాకుండా చేతల్లో చూపిన నాయకుడు..  
మహిళల అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న నాయకుడు.. వైఎస్‌ జగన్‌. తమకు దేవుడి ఇచ్చిన అన్న జగన్‌ అని ప్రతి మహిళ చెబుతోంది. కరోనా సంక్షోభ సమయంలో పేదల ఇళ్లల్లో పొయ్యి వెలిగిందంటే దానికి కారణం ఆయనే. 
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి  

ఇళ్లను టీడీపీ అడ్డుకుంది 
వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మద్యం అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. పేదల ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇళ్లను నిర్మిస్తుంటే టీడీపీ అడ్డుకుంది.  
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి 

దివంగత మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సంతాపం
సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో దివంగతులైన మాజీ శాసనసభ్యులకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. గురువారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ తీర్మానాన్ని చదివారు.

మాజీ ఎమ్మెల్యేలు ఎం.అబ్దుల్‌ అజీజ్, ఎ.రామిరెడ్డి, పి.కృష్ణమూర్తి, పి.రంగనాయకులు, వంకా శ్రీనివాసరావు, డాక్టర్‌ టి.వెంకయ్య, డి.పేరయ్య, పిన్నెల్లి లక్ష్మారెడ్డి, ఎంవీ రమణారెడ్డి, డాక్టర్‌ ఎస్‌.పిచ్చిరెడ్డిల మృతికి శాసనసభ సంతాపం ప్రకటిస్తున్నట్లు స్పీకర్‌ పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపు శాసనసభ మౌనం పాటించి దివంగతులకు నివాళులర్పించింది. 

బద్వేలు ఎమ్మెల్యేగా దాసరి సుధ ప్రమాణ స్వీకారం 
సాక్షి, అమరావతి: ‘నాడు మెడిసన్‌ పరీక్షలు రాసేందుకు పరీక్ష హాల్లోకి వెళ్లే సమయంలో భయపడ్డాను.. మళ్లీ నేడు రాష్ట్ర అసెంబ్లీలోకి అడుగుపెడుతూ అదే విధంగా భయపడ్డాను. ఎమ్మెల్యే అవుతానని అసెంబ్లీకి వస్తానని నేను కలలో కూడా ఊహించలేదు..’ అంటూ కొత్తగా ఎన్నికైన వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ ఉద్వేగంతో చెప్పారు.

 కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన దాసరి సుధ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆమెతో ప్రమాణం చేయించారు. మహిళా సాధికారతపై చర్చలో పాల్గొన్న అనంతరం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. ‘ప్రమాణ స్వీకారం చేసిన రోజే మాట్లాడే అవకాశం రావటం గొప్ప విషయం’ అని ఎమ్మెల్యే సుధ చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement