అచ్చంపేట: పల్నాడు జిల్లా అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్ట్‌కు అమర్చిన 16వ నంబరు రేడియల్ గేటు 2021 ఆగస్ట్ 5న కృష్ణా నది వరదలకు కొట్టుకుపోగా.. కొత్త గేటు అమర్చే పనులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గేటు కొట్టుకుపోయిన నాటినుంచి ఇప్పటివరకు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్‌తో 16వ నంబర్ గేటును బ్లాక్‌చేసి ప్రాజెక్ట్‌లో సాగునీటిని నింపుతూ వచ్చారు.
కాగా.. కొత్తగేటును అమర్చేందుకు ప్రభుత్వం రూ.22.05 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.7.53 కోట్లతో రేడియల్ గేటు తయారీ, రూ.1.73 కోట్లతో కాంక్రీట్ పనులు, రూ.9.57 కోట్లతో అన్ని గేట్లను క్రమబద్ధీకరించే పనులు చేపట్టాల్సి ఉంది. మరో రూ.3.20 కోట్లతో నడక దారిని ఏర్పాటు చేయాలి. ఆయా పనులు రెండు నెలలుగా శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటివరకు కాంక్రీట్, గడ్డర్స్, ఆమ్స్, స్కిన్‌ప్లేట్స్ పనులను పూర్తి చేశారు. కొత్త రేడియల్ గేటును ప్రాజెక్ట్‌కు అమర్చాల్సి ఉంది. ఈ నెల 2 నుంచి 16 వరకు 16వ నంబర్ గేటు అమర్చే పనులు చేపట్టనున్నారు.
ప్రాజెక్ట్ మీదుగా రాకపోకలు నిలిపివేత
పనులకు అంతరాయం ఏర్పడకుండా ప్రాజెక్ట్ మీదుగా మంగళవారం నుంచి 15 రోజులపాటు రాకపోకలను నిలిపివేశారు. రేడియల్ గేటు పైభాగంలో కోల్తార్ పెయింట్స్ వేసి రబ్బరు సీల్స్ బిగించి, గ్రీజింగ్ చేయాల్సి ఉంది.
ఈ పనులు పూర్తయిన వెంటనే రేడియల్ గేట్‌ను ప్రాజెక్ట్‌కు బిగించేందుకు 100 టన్నుల క్రాలర్ హెవీలోడ్ క్రేన్, 80 టన్నుల టైర్‌మౌంటెడ్ క్రేన్‌లను సిద్ధం చేశారు. పనులను సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీరామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అరుణకుమారి, అసిస్టెంట్ ఇంజినీర్లు విక్రమ్, వెంకటరెడ్డి పర్యవేక్షించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment