పెనమలూరు పాఠశాలలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం
పెనమలూరు/కంకిపాడు: మనబడి నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారాయని, మౌలిక వసతులు భేషుగ్గా ఉన్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం కితాబిచ్చింది. కృష్ణా జిల్లా కంకిపాడులోని మండల పరిషత్ ఆదర్శ పాఠశాల, జెడ్పీ పాఠశాల, పెనమలూరు జిల్లా పరిషత్ పాఠశాలలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం మంగళవారం పరిశీలించింది.
సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు (ఎస్‌ఏఎల్‌టీ) ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఈ బృందం వచ్చింది. ఆయా పాఠశాలల్లో భవన నిర్మాణాలు, కల్పించిన మౌలిక వసతులను పరిశీలించి, నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేసింది. పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్న సామగ్రిని పరిశీలించింది. తరగతి గదుల్లో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సాగిస్తున్న బోధన తీరును ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు.
నాణ్యత, మౌలిక వసతులతో పాఠశాలల రూపురేఖలు మారడంతో విద్యా ప్రమాణాల స్థాయి పెరిగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాడు–నేడు ద్వారా తొలి దశ, రెండో దశల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, కేటాయించిన నిధులు, మౌలిక వసతుల కల్పన చర్యలను నాడు–నేడు ప్రత్యేక అధికారి మురళి ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు.
విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదగాలి..
ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ టాస్క్ టీమ్ లీడర్ కార్తీక్ పెంతల్ మాట్లాడుతూ.. నాడు–నేడు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక సదుపాయాలు కల్పించిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయికి ఎదగాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు, వసతులు బాగున్నాయని ప్రశంసించారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆకునూరు మురళి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అతుర్‌పానే, ట్రైసీవిలి కౌష్కి, ఆదిత్య శర్మ, స్వాతి గమేలియల్, సురభి, దీప బాలకృష్ణన్, కాంచన్ రాజీవ్‌సింగ్, తనూష్ మాధుర్, కృష్ణా డీఈవో తాహేరా సుల్తానా, పలువురు కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment