
అవమానభారం అంటే ఏమిటో ఇప్పుడు తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు తెలిసివస్తూంటుంది. స్వపక్షం నుంచే వస్తున్న విమర్శల జడిని నేరుగా తిప్పికొట్టలేక, అలాగని జవాబు కూడా ఇవ్వలేని స్థితిలో యనమల ఉన్నట్లు స్పష్టమవుతోంది. తెలుగుదేశం వాళ్లే ఆయనను బ్లాక్‌మెయిలర్‌గా అభివర్ణిస్తూండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు యనమల. గతంలో యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉండగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు జరిగిన పరాభవాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు.
తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎక్కింది మొదలు యనమలకు పార్టీలో గుర్తింపు లేకుండా పోతోందన్న అంచనాలకు బలం పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆశించిన రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడం ఒక అవమానమైతే.. కాకినాడ పోర్టు యజమాని కేవీరావుపై చంద్రబాబుకు రాసిన లేఖ సొంత పార్టీలో ఆయన్ను పరాయివాణ్ణి చేసింది. పదవి ఇవ్వలేదన్న అక్కసుతో యనమల నేరుగా బాబునే బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఆ లేఖ రాశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులే దూషణలకు దిగుతారని బహశా ఆయన కూడా ఊహించి ఉండరు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన యనమల 1994లో టీడీపీ హయాంలో స్పీకర్‌గానూ పనిచేశారు.
రాజకీయ జీవితంలో ఇదే ఆయనకు మేలిమలుపు అంటారు. నిజానికి అప్పట్లో ఎన్టీఆర్ కూడా యనమలకు మంత్రి పదవి కానీ, ఇతర పదవి ఏదైనా కూడా ఇచ్చేందుకు సుముఖత చూపలేదని అంటారు. తనకు విశ్వాసపాత్రుడైన గాలి ముద్దు కృష్ణమనాయుడికి స్పీకర్ పదవి ఇవ్వాలన్నది ఎన్టీఆర్ ఆలోచన. అయితే ముద్దుకృష్ణమ ఇష్టం మేరకు మంత్రిని చేశారు. ఈ అవకాశాన్ని వాడుకున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా స్పీకర్ పదవికి యనమల పేరును తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ ను ఒప్పించారు. బాబు కుట్రల గురించి పెద్దగా ఆలోచించని ఎన్టీఆర్అంగీకరించడం.. ఆ తరువాత తొమ్మిది నెలలకే యనమల సహకారంతో ఎన్టీఆర్ పదవీచ్చుతి చకచకా జరిగిపోయాయి... బాబు డైరెక‌్షన్‌లో! ఆంధ్రప్రదేశ్‌లో వందలాది మందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్టీఆర్ ది.
యనమల కూడా వారిలో ఒకరు. అయినాసరే.. రాజకీయాల్లో విశ్వాసానికి తావులేదనట్టుగా చంద్రబాబు, యనమల వంటి వారు రుజువు చేశారు. వాస్తవానికి 1994 ప్రాంతంలో చంద్రబాబు వర్గం ప్రధాని పీవీ నరసింహరావును కూడా బుట్టలో వేసుకోగలిగిందని, అందుకే పార్టీ రాష్ట శాఖ ఆలోచనలకు భిన్నంగా పీవీ బాబుకు సాయం చేశాడని అంటారు. శాసనసభ రద్దుకు ఎన్టీఆర్ చేసిన సిఫారసును గవర్నర్ కృష్ణకాంత్ పట్టించుకోకపోవడం, మంత్రిపదవి నుంచి బర్తరఫ్ అయిన చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వడం, శాసనసభలో జరగాల్సిన బలపరీక్షను స్పీకర్ యనమల చేతిలో పెట్టడం వంటివన్నీ ఇందుకు నిదర్శనాలు.
యనమల స్థానంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు స్పీకర్‌గా ఉండి ఉన్నట్లైతే ఎన్టీఆర్ పదవి అంత తేలికగా పోయేది కాదు. చంద్రబాబు తన వర్గం ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్‌లో ఉంచినప్పుడు ఎన్టీఆర్ స్వయంగా తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి అక్కడకు వెళితే, టీడీపీ వారే చెప్పులు విసిరారు. సినీ రంగంలోను, రాజకీయ రంగంలోను ఎదురులేని మొనగాడిగా అందరి ప్రశంసలు పొందిన ఎన్టీఆర్ కు ఎదురైన దుర్గతి అది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు గవర్నర్ స్వయంగా వెళ్లి ఆయన నుంచి రాజీనామా పత్రం తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారు. పిమ్మట అసెంబ్లీ సమావేశంలో తన వాదన వినిపించడానికి ఎన్టీఆర్ పలుమార్లు ప్రయత్నించారు.
చంద్రబాబుపై కుట్రలను వివరించే ప్రయత్నం చేసిన ప్రతిసారి స్పీకర్ యనమల మైక్ కట్ చేసేవారు. ఆ అవమానం భరించలేక ఎన్టీఆర్ తన వర్గం ఎమ్మెల్యేలతో వాకౌట్ చేశారు. పదవి కోల్పోయాక ఎన్టీఆర్ మీడియా సమావేశం పెట్టి సొంతపార్టీ వారి చేతిలో, సొంత కుటుంబం చేతిలో పరాభవానికి గురైన తీరు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రాజకీయాలలో ఎంత పెద్ద నాయకుడైనా ఒక్కోసారి ఇలా అవమానాలకు గురి అవుతారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు యనమల వంతు. 2019 వరకు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న యనమల, ఆ తర్వాత ఎమ్మెల్సీగా, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగానూ ఉన్నారు. 1983 నుంచి 2004 వరకు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన 2019లో ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి పొందగలిగారు. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యారు.
అశోక్ గజపతి రాజు వంటి నేతలను తోసిరాజని పార్టీలో చంద్రబాబు తర్వాత సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. అందుకే ఆయన తాను కోరితే రాజ్యసభ సభ్యత్వం కష్టం కాదని అనుకున్నారు. భంగపడ్డారు. పార్టీలో బాబుకంటే లోకేష్ ప్రాభవమే ఎక్కువ అవుతూండటం దీనికి కారణంగా చెబుతున్నారు. సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలను బాబు కూడా ప్రోత్సహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నమాట. ఈ నేపథ్యంలోనే 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాజకీయంగా యనమలను పక్కన పెట్టేశారన్న అభిప్రాయం పార్టీలో ఏర్పడింది. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేనట్లుగా యనమల ఏపీ రాజకీయాల నుంచి వైదొలగి పార్లమెంటుకు వెళ్లాలని అనుకున్నా... చంద్రబాబు, లోకేష్‌లు ఆయనకు కాకుండా వైసీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుకు, పలు అక్రమాల ఆరోపణలు ఉన్న సానా సతీష్ వైపు మొగ్గు చూపారు.
నిజానికి ముగ్గురు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన టీడీపీ తన సొంత పార్టీ నేతలకు ఈ పదవులు ఇవ్వలేకపోయింది. పోనీ ఖాళీగా ఉన్న మంత్రి పదవి అయినా ఇస్తారా అని ఎదురుచూస్తే, దానిని నాగబాబుకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంత్రి పదవి, రాజ్యసభ సీటు రెండూ రావడం లేదని స్పష్టమైందన్నమాట. ఎమ్మెల్సీగానే కొనసాగాలన్న మాట. సానా సతీష్ తో పోల్చితే యనమల కచ్చితంగా మెరుగైన రాజ్యసభ అభ్యర్ధి. పార్టీ వాదనను బలంగా చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవారు. అయితే ఈయన వల్ల ఢిల్లీలో పెద్దగా ఉపయోగం ఉండదని, సానా సతీష్ లాబీయింగ్‌లో దిట్ట అని చంద్రబాబు, లోకేష్‌లు భావించి ఉండవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ సెజ్ భూములను కేవీరావు చౌదరి ఎలా దోచేసింది వివరిస్తూ యనమల లేఖ రాయడం సంచలనమైంది.
కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా కేవీరావు నుంచి లాక్కున్నారంటూ కొందరు వైఎస్సార్‌సీపీ నేతలపై, ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అధినేతపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు వేసిన ప్లాన్‌కు ఈ లేఖ గండి కొట్టింది. టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయే పరిస్తితి ఏర్పడింది. దాంతో యనమల లేఖలోని అంశాల జోలికి వెళ్లకుండా, ఆయనను తిట్టడానికే టీడీపీలోని కొన్ని వర్గాలు పనికట్టుకున్నాయి. రాజ్యసభ సీటు ఇవ్వలేదనే ఈ లేఖ రాశారని టీడీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. యనమలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కేవీరావు చివర చౌదరి అని కులం పేరు తగిలిస్తారా అని మండిపడ్డారు. కమ్మ కులం మద్దతు లేకుండానే యనమల ఈ స్థాయికి వచ్చారా అని వారు ప్రశ్నించారు.
అయితే యనమల వెనక్కి తగ్గకుండా ఒక ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ తన చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. తన పేరు చివర యాదవ అని లేనంత మాత్రాన కులం పోదు కదా? అని ప్రశ్నించారు ఆయన. యనమల కుటుంబానికి నాలుగు పదవులు ఉన్నా సంతృప్తి లేదని, అసలు పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవ ఏముందని కూడా కొందరు వ్యాఖ్యానించారు. యనమల తమ్ముడు అసెంబ్లీ టిక్కెట్ అడిగినా, ఆయనను కాదని ఈయన ఒక కుమార్తెకు తుని టీడీపీ టిక్కెట్ ఇచ్చిన మాట నిజమే. అలాగే వియ్యంకుడు పుట్టా సుధాకర్ కు రాయలసీమలోని మైదుకూరు అసెంబ్లీ సీటును, ఈయన కుమారుడు, యనమల మరో అల్లుడు పుట్టా మహేష్ కుమార్‌కు ఏలూరు లోక్ సభ సీటు ఇచ్చారు.అయితే సుధాకర్, ఆయన కుమారుడికి టిక్కెట్లు రావడంలో యనమల పాత్ర పెద్దగా లేదని, పార్టీకి చేసిన సేవల రీత్యా లభించాయని కొందరి అభిప్రాయం.
ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ప్రత్యర్ది పార్టీలు విమర్శిస్తుంటాయని, కాని ఆ వెన్నుపోటు పొడిచింది యనమల అవుతారు కదా అని టీడీపీ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈయనకు ఇచ్చిన ప్రాధాన్యత గతంలో ఎవరిరీ లభించలేదని, ఈయన పార్టీలో ఇతరనేతలు ఎవరిని ఎదగనివ్వలేదని కూడా ఆయన అబిప్రాయపడ్డారు. టీడీపీ నేత, శాసనమండలి మాజీ డిప్యూటి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నేరుగా యనమలపై వ్యాఖ్యానిస్తూ ఆయన వల్ల పార్టీకి కలిగిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
యనమల బీసీ నేతలను పెరగనివ్వకుండా అణగదొక్కి, తాను మాత్రమే లాభపడ్డారని విమర్శించారు. టీడీపీ అధినాయకత్వం సూచన లేకుండానే సుబ్రహ్మణ్యం ఈ విమర్శలు చేశారా అన్న సందేహం ఏర్పడుతోంది. గతంలో యనమలను ఇంత నేరుగా విమర్శించే సాహసం పార్టీలో ఎవరూ చేసేవారు కాదు. కాని కాలచక్రం మారుతుంది కదా! ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సర్దుకుపోయి అవమానం భరించడం తప్ప యనమల చేయగలిగింది కూడా ఏమీ లేదేమో!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత