మృతుడు వరహాలు, గల్లంతైన పిట్ల శ్రీను (ఫైల్)
తొండంగి(కాకినాడ జిల్లా): సముద్రంలో గల్లంతైన తన తండ్రిని కాపాడేందుకు వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మండలంలోని పెరుమాళ్లపురం పంచాయతీ కొత్తచోడిపల్లిపేట సముద్రతీరంలో గురువారం వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెరుమాళ్లపురం పాత చోడిపల్లిపేటకు చెందిన యదాల వరహాలు (30), చింతకాయలపేటకు చెందిన పిట్ల శ్రీను (28) వినాయక నిమజ్జనంలో భాగంగా సముద్రంలో స్నానానికి దిగారు. స్నానం చేస్తూ మొత్తం పది మంది గల్లంతవ్వగా స్థానిక మత్స్యకారులు శ్రీలం కొండబాబు, యాదాల సుబ్రహ్మణ్యం, కడారి రామారావు, కడారి రాంబాబు, పేకేటి యతిమాని, కడారి రమణలతో పాటు మరో ఇద్దరిని కాపాడారు. వరహాలు, శ్రీను గల్లంతయ్యారు.
చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..?
ముమ్మరంగా గాలింపు
గల్లంతైన వారిలో తన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండడంతో కాపాడేందుకు వెళ్లిన వరహాలు గల్లంతయ్యాడు. కాసేపటికి ఇతని మృతదేహం లభ్యంకాగా గల్లంతైన శ్రీను ఆచూకీ కోసం మత్స్యకారులు, అతని బంధువులు గాలిస్తున్నారు. యాదాల వరహాలు తండ్రి సుబ్రహ్మణ్యం కొత్తచోడిపల్లిపేటలో కిరణా షాపు నిర్వహించకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు వరహాలుకు వివాహం కాగా భార్య, రెండున్నరేళ్ల కుమార్తె, 15 రోజుల వయసు గల బాబు ఉన్నారు. చింతకాయలపేటకు చెందిన పిట్ల సుబ్బారావు, సుబ్బలక్ష్మి కుమారుడు పిట్ల శ్రీను, మృతుడు వరహాలు హేచరీలో వర్కర్లుగా పని చేస్తున్నారు. శ్రీనుకు రెండేళ్ల క్రితం అక్క కూతురు ప్రశాంతితో వివాహమైంది. ప్రస్తుతం ప్రశాంతి ఏడు నెలల నిండు గర్భిణి. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతుకావడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని తుని రూరల్ ఎస్సై సన్యాసిరావు, ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment