![Youth showing interest on Photography along with studies - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/23/CAMERA_.jpg.webp?itok=Pq0Jfk95)
ఫొటోలు దిగడమే కాదు.. ఫొటోలు తీయడాన్ని కూడా యువత ట్రెండ్‌గా మార్చేస్తోంది. ఖాళీ దొరికినప్పుడల్లా ఖరీదైన కెమెరాలను భుజాన వేసుకుని బైక్‌లపై ఫొటోషూట్‌కు పరుగెడుతోంది. తమలోని అభిరుచులను ఎప్పటికప్పుడు కొత్తగా ప్రదర్శిస్తూ ఔరా అనిపిస్తోంది. ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు కెమెరాలు క్లిక్‌మనిపిస్తూ అనుభూతితో పాటు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది.
సాక్షి, అమరావతి: ఇటీవల కాలంలో యువత ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకోవడంతో పాటు సొంత కెమెరా కొనుక్కోవడం కోసం విలాసాలకు దూరంగా ఉంటోంది. ఖరీదైన సెల్‌ఫోన్లు, బైక్‌ల వాడకాన్ని తగ్గించుకుని ఆ డబ్బుతో మంచి కెమెరాను కొనుగోలు చేసి తనలోని ప్రతిభ అందులో బంధిస్తోంది. ఇంటర్ మొదలు ఇంజనీరింగ్ వరకు చాలా మంది విద్యార్థులు ఫొటోగ్రఫీని హాబీగా మార్చుకుంటున్నారు. వాయిదా పద్ధతుల్లో రూ.40 వేల నుంచి రూ.లక్షకు పైగా వెచ్చించి కెమెరాలు కొనుగోలు చేస్తున్నారు. సాయంత్ర సమయాలు, వారాంతాల్లో స్నేహితులకు ఫొటో షూట్‌లు చేస్తూ పాకెట్‌మనీని సంపాదించుకుంటున్నారు. ఒక్కో కాపీకి రూ.60 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. సరాసరి నెలకు రూ.6,000 నుంచి రూ.10,000 వరకు ఆర్జిస్తున్నారు. కొందరైతే చదువును కొనసాగిస్తూనే ఫొటోగ్రఫీపై పూర్తిగా ఆధారపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంటి వద్దనే ఎడిటింగ్ వర్క్ చేస్తూ నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు సంపాదిస్తున్నారు. డబ్బు సంపాదన లక్ష్యం కాకుండా కూడా ఫ్రీలాన్సర్లుగా నేచర్, వైల్డ్ ఫొటోగ్రఫీని ఆస్వాదిస్తూ..స్నేహితులు, కళాశాలల్లో కార్యక్రమాలకు ఫొటోలు తీస్తున్న యువత కూడా ఉంది.
సోషల్ మీడియా మేనియా..
యువత రోడ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు, పురాతన కట్టడాలు, హిల్ స్టేషన్లలో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా దిగిన ఫొటోలను వెంటనే ఫేస్‌బుక్, వాట్సాప్ స్టేటస్, డీపీ ఇలా నచ్చిన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ మురిసిపోతున్నారు. ఇందుకోసమే విద్యార్థులు కళాశాలల్లో జట్టుగా ఏర్పడి ప్రతి వారాంతంలో ఫొటో షూట్‌లకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో అందరూ కలిసి కెమెరాను కొనుగోలు చేయడమో..అద్దెకు తీసుకోవడమో చేస్తున్నారు.
ప్రతిభకు మెరుగులు ఇలా..
తొలుత తోటి విద్యార్థులు, తెలిసిన వాళ్లకు ఫొటోలు తీస్తూ తమలోని ప్రతిభకు పదును పెడుతున్నారు. పనితనం నచ్చిన వాళ్లు ఈవెంట్, ఔట్ డోర్ ఫొటోషూట్‌లకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పట్టణాల్లోని ప్రముఖ స్టూడియోలు, ఫొటోగ్రాఫర్లు సదరు యువతను స్టిల్ ఫొటోగ్రఫీకి పార్ట్‌టైమర్లుగా నియమించుకుంటున్నారు.
అద్దెకు కెమెరాలు
సొంత కెమెరాలు లేని వారు అద్దె ప్రాతిపదికన కెమెరాలను తీసుకువచ్చి ఫొటోషూట్‌లు చేస్తున్నారు. 8 గంటలు, 12 గంటల వ్యవధిలో సెమీ ప్రొఫెషనల్ కెమెరాలకు రూ.600 నుంచి రూ.1,000, డీఎస్‌ఎల్‌ఆర్ ప్రొఫెషనల్ కెమెరాలకు రూ.1,000 నుంచి రూ.2,000, మిర్రర్ లెస్ హైలీ ఫ్రొఫెషనల్ కెమెరాలకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఈవెంట్‌ను బట్టి కెమెరాలను తీసుకుంటూ తమ ప్యాకేజీలను ఫిక్స్ చేస్తున్నారు.
సరదాగా నేర్చుకున్నా.. కుటుంబాన్ని పోషిస్తోంది!
నేను సరదాగా ఫొటోగ్రఫీ నేర్చుకున్నాను. ఇప్పుడది నా కుటుంబాన్ని పోషించే మార్గాన్ని చూపించింది. ఆరేళ్ల కిందట మా నాన్న మాకు దూరమయ్యారు. అప్పుడు నేను ఇంటర్‌లో ఉన్నాను. అప్పటి నుంచి మా అమ్మ, తమ్ముడి బాధ్యత నేనే చూసుకుంటున్నాను. ఇప్పుడు నేను బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాను. వారాంతాల్లో కాలేజీ స్టూడెంట్స్‌కు ఫొటో షూట్లు చేస్తూనే..బయట నుంచి వచ్చిన వీడియో ఎడిటింగ్ వర్క్స్ చేస్తూ నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు సంపాదిస్తున్నాను. నాకు సొంతంగా రెండు ఫొటో, ఒక వీడియో కెమెరాలు ఉన్నాయి.
– బి.నవీన్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment