వీడియోలకు కత్తెర! అమెరికాను దాటేసి ప్రథమ స్థానంలో భారత్‌ | YouTube deleted 14 lakh videos in India | Sakshi
Sakshi News home page

వీడియోలకు కత్తెర! అగ్రరాజ్యం అమెరికా కంటే అధికంగా భారత్‌ ప్రథమ స్థానంలో

Published Mon, Jun 6 2022 3:54 AM | Last Updated on Mon, Jun 6 2022 8:39 AM

YouTube deleted 14 lakh videos in India - Sakshi

సాక్షి, అమరావతి: యూట్యూబ్‌లో సెన్సారింగ్‌ భారీగానే జరుగుతోంది. విచిత్రమేంటంటే ఇలా కత్తెర వేటుకు గురైన వీడియోల సంఖ్యలో భారతదేశం అమెరికాను మించిపోయింది. మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పెద్దగా ఎవరూ చూడకముందే ఇండియాలో 11,75,859 వీడియోలను బ్లాక్‌ చేసినట్లు యూట్యూబ్‌ వెల్లడించింది.

వీటిల్లో ఎక్కువగా పిల్లల భద్రత, హింసాత్మక కంటెంట్, అశ్లీల వీడియోలు ఉన్నట్లు సంస్థ తెలియజేసింది. ఇటీవల యూట్యూబ్‌ సంస్థ కమ్యూనిటీ మార్గదర్శకాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికను విడుదల చేసింది. ఇందులో 2022 తొలి త్రైమాసికం (జనవరి–మార్చి)లో ప్రపంచ వ్యాప్తంగా 38.82 లక్షల వీడియోలను బ్లాక్‌చేస్తే అందులో అగ్రరాజ్యం అమెరికా కంటే అధికంగా భారత్‌ ప్రథమ స్థానంలో ఉండడం గమనార్హం.  

అదనంగా 2,58,088 వీడియోలను తొలగింపు 
వాస్తవానికి గ్లోబల్‌ కమ్యూనిటీ నివేదిక కంటే దేశంలో తొలగించిన వీడియోల సంఖ్య ఎక్కువగానే ఉంది. నివేదికలో కమ్యూనిటీ మార్గదర్శకాల ప్రకారం సొంత మోడరేటర్లు, విశ్వసనీయ ఫ్లాగర్లు, ఆటోమేటెడ్‌ అల్గారిథమ్‌లు వంటి సాంకేతికత ద్వారా తొలగించిన వీడియోల సంఖ్యను మాత్రమే చూపిస్తారు. అయితే, దేశ ఐటీ రూల్స్‌–2021 ప్రకారం.. యూట్యూబ్‌కు ఫిర్యాదులు పరిష్కారించే అధికారులున్నారు. వీరికి దేశవ్యాప్తంగా యూజర్లు, ఎన్జీఓలు, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా 95వేల ఫిర్యాదులు అందాయి.

వాటి ఆధారంగా 2,58,088 వీడియోలను అదనంగా తీసేశారు. దీంతో దేశంలో మొత్తం 14,33,947 వీడియోలను తొలగించినట్లయింది. ఇందులో అధికంగా పిల్లల భద్రతకు సంబంధించి 24.9 శాతం, హింసాత్మక కంటెంట్‌ 21.2 శాతం, అశ్లీల కంటెంట్‌ వీడియోలు 16.9 శాతం ఉన్నాయి. యూట్యూబ్‌ అనుచిత, అశ్లీల, అతివాద కంటెంట్, సైబర్‌ బెదిరింపులు, తప్పుదారి పట్టించే, తప్పుడు సమాచార (స్పామ్‌) వీడియోలను తొలగించడానికి 91 శాతం ఆటోమేటెడ్‌ అల్గారిథమ్‌ సహాయపడింది.
 

గడిచిన రెండేళ్లుగా.. 
ఇక యూట్యూబ్‌ ఎక్కువ వీడియోలను తొలగిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ గడిచిన రెండేళ్లుగా అగ్రస్థానంలో ఉంటోంది. 2019 మూడో త్రైమాసికంలో 5వ స్థానంలో ఉండగా 2020 తొలి త్రైమాసికానికి వచ్చేసరికి రెండో స్థానంలోనూ, అదే ఏడాది మూడో త్రైమాసికం నుంచి ఇప్పటివరకు మొదటి స్థానంలో కొనసాగుతోంది.  

44 లక్షల చానెళ్లు నిలిపివేత 
ఈ ఏడాది తొలి మూడునెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల చానెళ్లను నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించింది. 90 రోజుల వ్యవధిలో కంపెనీ మార్గదర్శకాలను మూడుసార్లు ఉల్లంఘిస్తే సదరు చానెల్‌ను అందులోని వీడియోలను తొలగించనున్నట్లు వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement