ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది.. అక్క చెల్లెమ్మలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.. వారి ముఖాల్లో సంతోషం ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.. ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటాను మరోసారి భరోసా ఇస్తున్నాను.. అక్క చెల్లెమ్మలు చేపట్టబోయే వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లాలి.. వారికి ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాను.. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఇన్నాళ్లూ నిర్లక్ష్యం.. వాటిని బాగు చేయాలని గత ప్రభుత్వాలు ఏనాడూ భావించలేదు.. చిత్తశుద్ధితో పథకాలు చేపడితే ఎలా ఉంటాయన్న దానికి ఉదాహరణే ఇప్పుడు మనం అమలు చేస్తున్న పథకాలు..
సాక్షి, అమరావతి : వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో చేపట్టిన మేకలు, గొర్రెల పంపిణీ ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా, మొత్తం రూ.1869 కోట్ల వ్యయంతో పథకం అమలు చేస్తున్నారు. కార్యక్రమం ప్రారంభంలో వైఎస్ జగన్‌కు గొంగడి కప్పి, తాటి ఆకులతో రూపొందించిన గొడుగు, మేక పిల్లను లబ్ధిదారులు బహుకరించారు.
అవి ఆదాయం కల్పించే వనరులు:
– జగనన్న జీవక్రాంతి పథకం అత్యంత తృప్తి ఇచ్చే పథకాల్లో ఇది ఒకటి.
– వ్యవసాయంతో పాటు, మేకలు, పశువులు, కోళ్లు, చేపల సాగు వంటివి చేపడితే రైతుల కుటుంబాలకు ఎంతో అండగా ఉంటుంది.
– కరవు, కాటకాలు వచ్చినా అవి ఆదుకుంటాయి. రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు అదనంగా ఆదాయం కల్పించే వనరులు అవి.
– గత ప్రభుత్వాలు ఏనాడూ వ్యవసాయ అనుబంధ రంగాలను బాగు చేయాలని భావించలేదు.
మరి మన ప్రభుత్వ హయాంలో:
– చిత్తశుద్ధితో పథకాలు చేపడితే ఎలా ఉంటాయన్న దానికి ఉదాహరణ.
– అమూల్‌తో ఒప్పందం తర్వాత 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ, అంటే ఒక ఆవు దూడ లేదా కడుపుతో ఉన్న గేదె పంపిణీ.
– ఇవాళ 2.49 లక్షల యూనిట్ల మేకలు, గొర్రెలు పంపిణీకి ఇవాళ శ్రీకారం.
– ఒక్కో యూనిట్‌లో 15 మేకలు లేదా గొర్రెలు. వాటిలో 14 ఆడవి కాగా, ఒకటి మగది (మేకపోతు లేదా పొట్టేలు).
ఇవన్నీ ఎందుకంటే..:
– గ్రామీణ ప్రాంతాల్లో చేయూత, ఆసరా కింద ఊరికే సహాయం చేయడం కాకుండా, ఆ డబ్బులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలు వ్యాపారం చేసుకునేలా ప్రయత్నం.
– దాని వల్ల అదే గ్రామంలో వారికి ఉపాధి కల్పించడంతో పాటు, ఆదాయ వనరు ఏర్పర్చినట్లు అవుతుంది.
– దాని వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మల జీవితాలు మారుతాయి.
– చేయూత పథకంలో ఏటా రూ.18,750 చొప్పున 4 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వడంతో పాటు, వారిని చేయి పట్టుకుని నడిపిస్తే బాగుంటుందని, ఒక తమ్ముడిగా, అన్నగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఈ అడుగులు ముందుకు పడుతున్నాయి.
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు:
– ఇవాళ 2.49 లక్షల యూనిట్లను దాదాపు రూ.1869 కోట్ల వ్యయంతో పథకం.
– 4.69 యూనిట్లు ఆవులు, గేదెల పంపిణీకి రూ.3500 కోట్లకు పైగా వ్యయం.
– రెండూ కలిపి దాదాపు రూ.5500 కోట్ల వ్యయంతో అక్క చెల్లెమ్మల జీవితాలు మార్చే ప్రయత్నం.
– 2,11,780 ఆవుల యూనిట్లు, 2,57,211 గేదెల యూనిట్ల పంపిణీని వారం క్రితం ప్రారంభించాం.
– పథకం ప్రారంభం రోజున 7 వేల యూనిట్లు పంపిణీ చేశాం. వచ్చే ఫిబ్రవరి నాటికి లక్ష యూనిట్లు, ఆ తర్వాత ఆగస్టు నుంచి మళ్లీ ఫిబ్రవరీ (2022) వరకు 3.69 లక్షల యూనిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది.
– ఆ విధంగా దాదాపు 4.69 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు పంపిణీ జరుగుతుంది.
– గొర్రెల యూనిట్లు 1,51,671 ఇంకా 97,480 మేకల యూనిట్లు పంపిణీకి షెడ్యూల్ ఇచ్చాం.
– 5 నుంచి 6 నెలల వయసున్న 14 మేక పిల్లలు, ఒక పొట్టేలు లేదా మేకపోతు ఇస్తాం. తొలి దశలో వచ్చే మార్చి చివరి నాటికి 20 వేల యూనిట్లు పంపిణీ.
– రెండో విడతలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1.30 లక్షల యూనిట్లు
మూడో సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు 99 వేల యూనిట్లు పంపిణీ.
– ఆ విధంగా దాదాపు 40 లక్షల మేకలు, గొర్రెలు. ఎక్కడెక్కడి నుంచో సేకరించాల్సి వస్తోంది. అందుకే మూడు దశల్లో కార్యక్రమం
అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు:
– రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్క చెల్లెమ్మల జీవితాలలో వెలుగులు తీసుకు వచ్చేందుకు ఏడాదిన్నరగా ఎన్నో పథకాలు అమలు చేశామంటూ వాటి ప్రస్తావన.
– ఇంకా నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం అక్క చెల్లెమ్మలకు ఇస్తూ చట్టం చేశాం.
మరోవైపు దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు కూడా అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం.
– ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం.
పలు సంస్థలతో ఒప్పందం:
– ఇవన్నీ కూడా గతంలో చేయూత డబ్బు ఇచ్చి, ఆ సొమ్ముతో అక్క చెల్లెమ్మలకు జీవనోపాధి కల్పించే చర్యలు తీసుకున్నాం.
– వారికి జీవనోపాధి కోసం ఐటీసీ, అమూల్, రిలయెన్స్, పీ అండ్ జీ, హెచ్‌ఎల్‌ఎల్, అల్లానా వంటి సంస్థలతో ఒప్పందం. ఆయా సంస్థల సహకారంతో అక్క చెల్లెమ్మలకు వ్యాపారంలో తోడ్పాటు.
– వ్యాపారంలో అక్క చెల్లెమ్మలకు తప్పనిసరిగా లాభాలు వచ్చేలా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.
సరైనవి ఎంచుకునేలా..:
– అయితే అక్కచెల్లెమ్మలలో ఎవరైతే మేకలు, గొర్రెలు కావాలనుకున్నారో వారికి ఇవాళ ఇస్తున్నాం.
– వారు స్థానిక జాతుల్లో నచ్చిన వాటిని కొనుగోలు చేసుకునే అవకాశం.
– వారికి సరైన ధరకు మేకలు, గొర్రెలు వచ్చేలా, అన్నీ సవ్యంగా జరగడం కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు.
– ఇద్దరు పశు వైద్యులు, సెర్ప్ అధికారులు, బ్యాంక్ అధికారులతో కమిటీ ఏర్పాటు. అవి లబ్ధిదారుడికి అడుగడుగునా తోడుగా నిలుస్తాయి. వారి ధృవీకరణ తర్వాతే వాటి కొనుగోలు.
– ఆ విధంగా అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తూ చేయి పట్టుకుని నడిపిస్తారు. దీని వల్ల అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతుంది.
ఆర్బీకేల ద్వారా మరిన్ని సేవలు:
– గ్రామాలలో ఆర్బీకేలు రైతులకు వ్యవసాయ పరంగానే కాకుండా, వారికి పశువుల పోషణలో కూడా పూర్తిగా తోడ్పడతాయి.
– రైతులు, అక్క చెల్లెమ్మలను ఆర్బీకేలు చేయి పట్టుకుని నడిపిస్తాయి.
– పశువుల మంచి చెడులు చూసే వ్యవస్థ కూడా ఆర్బీకేలలో ఏర్పాటు.
– నత్తల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, బాహ్య పరాన్న జీవుల నిర్మూలన, పశు ఆరోగ్య సంరక్షణ కార్డుల జారీ వంటివి ఆర్బీకేల పరిధిలో ఇంకా సమతుల్యమైన దాణా సరఫరా.
– వైయస్సార్ సన్నజీవుల నష్ట పరిహారం పథకం (ఇన్సూరెన్సు). దీన్ని కూడా ఆర్బీకేల పరిధిలోకి తీసుకువస్తున్నాం.
– టీకాలు వేయడం, వెటర్నరీ సర్వీసులు కూడా ఆర్బీకేల పరిధిలోకి తెస్తాం.
క్రెడిట్ కార్డులు–శిక్షణ:
– రైతుల మాదిరిగా పశువులకు కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ.
– ఆవులు, గేదెలు కొన్న వారితో పాటు, మేకలు, గొర్రెలు కొన్నవారికి కూడా ఉపయోగం.
– ఇంకా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల ఆధునిక పోషణ, యాజమాన్య పద్ధతులపై శిక్షణ.
– కర్నూలు జిల్లా డోన్, అనంతపురం జిల్లా పెనుగొండలో గొర్రెల పెంపకం శిక్షణా కేంద్రాలకు అనుమతి, త్వరలోనే ఏర్పాటు.
– వాటిలో శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తాం.
రాష్ట్రంలో అల్లానా గ్రూప్:
– మాంసం కొనడానికి అల్లానా గ్రూప్ ఉంది. ఆ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
– అయితే అంత కంటే ఎక్కువ ధర వస్తే అక్కచెల్లెమ్మలు నేరుగా అమ్ముకోవచ్చు. అల్లానాకే అమ్మాలని లేదు.
– అల్లానా గ్రూప్ తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలలో మీట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేస్తోంది.
పాడి రైతులు, అక్క చెల్లెమ్మలకు అండ:
– వ్యవసాయం, పాడి పశువుల రంగంలో ఉన్న రైతులు, అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం ఎంతో అండగా ఉంటుంది.
– రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది.
– అక్క చెల్లెమ్మలు బాగుంటే, రాష్ట్రం బాగుంటుందని, వారి ముఖాల్లో అహర్నిశలు సంతోషం ఉండేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తుంది.
ఒక అన్నగా, ఒక తమ్ముడిగా..:
‘ఆ అక్క చెల్లెమ్మలకు అన్నగా, తమ్ముడిగా అండగా ఉంటానని మరోసారి భరోసా ఇస్తూ, మీరు చేపట్టబోయే ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విలసిల్లాలని, మీకు ఇంకా మంచి జరగాలని, మీకు ఇంకా మేలు చేసే అవకాశం దేవుడు కల్పించాలని మనసారా కోరుకుంటున్నాను’. అంటూ జగన్ ప్రసంగం ముగించారు.
మరింత తోడుగా నిలుస్తాం :
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల్లో మరింత తోడుగా నిలుస్తామని ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన అల్లానా గ్రూప్ ఛైర్మన్ ఇర్ఫాన్ వెల్లడించారు. రాష్ట్రంలో మీట్ ప్రాససింగ్ యూనిట్లతో పాటు, మ్యాంగో ప్రాససింగ్ యూనిట్ కూడా ఏర్పాటుకు ఇదే సరైన సమయమని ఇర్ఫాన్ పేర్కొనగా.. జగన్ స్వాగతించారు. మరోవైపు బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలలో మేకలు, గొర్రెలలో మంచి బ్రీడ్ ఉందని, వాటిని ఇక్కడికి కూడా తీసుకువస్తే, రైతులు, అక్క చెల్లెమ్మలకు ఎంతో మేలు జరుగుతుందని, అందుకు తాము సహకరిస్తామని అల్లానా గ్రూప్ ఛైర్మన్ తెలిపారు.
దీనిపైనా సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్, ఆ దిశలో చురుకుగా పరిశీలించాలని పశు సంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీ అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా, జిల్లాల నుంచి అధికారులు, పథకం లబ్ధిదారులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment