సాక్షి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. ఆయన పాలన స్వర్ణయుగం. సాగుకు అందే ప్రతి నీటి చుక్కలో పెద్దాయన నవ్వులున్నాయి. కుయ్ కుయ్ కుయ్ అంటూ తిరిగే 108 అంబులెన్స్‌లు మహానేత దూర దృష్టే. లక్షల మందికి ప్రాణవాయువైన ఆరోగ్యశ్రీ.. పేద విద్యార్థుల పాలిట వరం ఫీజు రీయింబర్స్‌మెంట్.. సొంతింటి కలను నిజం చేసిన ఇందిరమ్మ ఇళ్లు.. ఇలా ఎన్నో రాజన్న చలువే. అవ్వాతాతలు, అక్కచెల్లెళ్ల జీవితాల్లో వెలుగులకు కారణం ఆయనే. జిల్లా అభివృద్ధిలో వైఎస్సార్‌ది చెరగని ముద్ర. యూనివర్సిటీ ఏర్పాటు.. సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ.. అనేక అభివృద్ధి పనులు.. ఆయన పాలనను ఇప్పటికీ జిల్లావాసులు మర్చిపోలేదు. బుధవారం రాజన్న వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
- కరువుతో జి ల్లా అతలాకుతలం అవుతోంది. ఈ తరుణంలో 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
- అన్నదాతల సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి నెలల వ్యవధిలోనే అమలు చేశారు.
- వందల కోట్ల రూపాయలతో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు.
- మహానేత చొరవతో ఆనాడు ప్రారంభమైన ప్రాజెక్టులు గతేడాది కాలంగా తుదిదశకు చేరుకోవడంతో సాగునీటి కష్టాలు దాదాపుగా తొలగిపోయాయి.
- 2004లో అధికారంలోకి రాకముందు జిల్లాలో మహానేత పాదయాత్ర సాగింది.
- ఈ సందర్భంగా ప్రతిచోటా రైతులు సాగునీటి సమస్యలను ఏకరువు పెట్టడం.. సరైన పరిశ్రమల్లేక ఉపాధి అవకాశాలు స్థానికంగా లేవని ప్రజలు విన్నవించిన నేపథ్యంలో అధికారంలోకి రాగానే దానిపై దృష్టి పెట్టారు.
ఏమి చేశారంటే..
- 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిల జలాశయం నీటి సామర్థ్యాన్ని రెండు దశల్లో 78 టీఎంసీల స్థాయికి తీసుకువచ్చారు.
- అనంతరం సమగ్ర సోమశిలలో భాగంగా 104 కిలోమీటర్ల పొడవునా ఉత్తరకాలువను సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు అభివృద్ధి చేసి నీటి ఔట్‌ఫ్లో సామర్థ్యాన్ని పెంచారు.
- జిల్లాలోనే కీలక ప్రాజెక్టులైన సంగం, పెన్నాపై దృష్టి సారించారు. 2006 మే 28వ తేదీన రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
- ఆ సమయంలో 800 మీటర్ల పొడవుతో దీనిని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతోపాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు.
- మళ్లీ దీనికి 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు.
- రాజన్న మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. తర్వాత వచ్చిన పాలకులు దీనిపై నిర్లక్ష్యం వహించారు.
- వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాజన్న కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీనిపై దృష్టి సారించి పనులు వేగవంతం చేయించడంతో ప్రస్తుతం 88 శాతం పూర్తయ్యాయి. 1185 మీటర్ల పొడవు, 84 గేట్లతో దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 42 ర్యాఫ్టులకు గానూ 39 పూర్తి చేశారు.
- 2008లో నెల్లూరులో పెన్నా బ్యారేజ్ రూ.126 కోట్ల వ్యయంతో నిర్మించడానికి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. 0.55 టీఎంసీ నీటి సామర్థ్యంతో తలపెట్టిన బ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా రూ.149.39 కోట్లకు చేరింది. ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తి చేసుకుంది.
- ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ జిల్లాకు చెందిన నేత కావడంతో పనుల పురోగతిని సమీక్షించడంతోపాటు కొద్దినెలల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తామని ప్రకటించారు.
- 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజ్‌ని నిర్మిస్తున్నారు.
సరికొత్తగా 108
- కరోనా సమయంలో వైఎస్సార్ మానసపుత్రిక అయిన 108 వాహనాలు కీలకంగా జిల్లాలో సేవలందిస్తున్నాయి.
- ఆయన హయాంలో ప్రారంభమైన 108, 104 వాహనాలను తదనంతర కాలంలో పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేశారు.
- దీంతో పల్లెల్లో సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు పడిన పరిస్థితి.
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే 108 పై దృష్టి సారించారు. అధునాతన సౌకర్యాలతో పరిపుష్టం చేసి నూతన వాహనాలను కొనుగోలు చేశారు.
- జిల్లాలోని 46 మండలాలకు 46 వాహనాలు కొత్తగా వచ్చాయి. గతంలో 15 వాహనాలున్నాయి.
- ప్రస్తుతం కోవిడ్ సమయంలో రోగులకు 108 అంబులెన్స్ సిబ్బంది అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకం.
- జూన్ నెలలో 5,071 మందిని, ఆగస్ట్ నెలలో 6,627 మంది రోగులను 108 వాహనాల ద్వారా ఆస్పత్రులకు తరలించి వందల సంఖ్యలో ప్రాణాలను కాపాడారు.
- ఇక 104 వాహనాల ద్వారా జూలై 15వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 36 వేల మందికి ప్రాథమిక వైద్యసేవలు ఇంటి వద్దే అందించారు.
సోమశిలకు జలకళ
- ప్రస్తుతం సోమశిల జలాశయం జలకళ సంతరించుకుంది.
- ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో జలాశయంలో ఇప్పటికే 46.813 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
- ప్రస్తుతం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌తోపాటు ఇతర ప్రాంతాలు కలుపుకుని 28,637 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదవుతుంది.
- వారంరోజుల నుంచి కండలేరు ప్రాజెక్టుకు రోజుకు 9,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
- గతేడాది సోమశిల సరికొత్త చరిత్ర సృష్టించింది. 78 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో కొన్నినెలలపాటు కొనసాగింది. మళ్లీ పూర్తి సామర్థ్యంతో నిండుకునే పరిస్థితితో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
రికార్డు స్థాయిలో..
- జిల్లాలో పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఖరీఫ్, రబీ రెండు సీజన్లు కలిపి అధికారికంగా 8 లక్షల ఎకరాలకు నీటిని అందించారు.
- ఈ ఏడాది రబీ సీజన్‌లో అధికారికంగా 5.47 లక్షల ఎకరాలకు గానూ 6 లక్షల ఎకరాలకు పైగా సాగు జరిగింది. అలాగే ఖరీఫ్ సీజన్‌లో రెండున్నర లక్షల ఎకరాలకు గానూ మూడు లక్షల ఎకరాల వరకు సాగు జరిగే పరిస్థితి. దీంతో జలవనరుల శాఖ గడిచిన రబీ సీజన్‌లో 51 టీఎంసీలు, ప్రస్తుత రబీ సీజన్‌లో 27 టీఎంసీలు నీటిని విడుదల చేశాయి.
- మొత్తంగా ఈ ఏడాది వ్యవధిలోనే రెండు పంటలకు కలిపి 78 టీఎంసీల పూర్తిస్థాయిలో నీరు అందించడం జిల్లాలో ఓ రికార్డు.
విద్యార్థుల కోసం..
- 2008 సంవత్సరం జూలై 14న వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలో 83 ఎకరాల విస్తీర్ణంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
- అనంతరం అదే నెల 28న కొత్తగా వర్సిటీకి వీసీని నియమించారు. అభివృద్ధి పనుల కోసం రూ.25 కోట్ల నిధులను రాజన్న విడుదల చేశారు.
- 2009 ఫిబ్రవరి 21న 42 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు.
- ప్రస్తుతం కాకుటూరులో నిర్మించిన నూతన భవనంలో 17 కోర్సులతో యూనివర్సిటీని నిర్వహిస్తున్నారు.
- 2012లో వర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఎట్టకేలకు 2018 మార్చి 6న ప్రారంభించారు.
ఆయకట్టు స్థిరీకరణ
- ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలోని 3.85 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు దోహదడుతుంది.
- పెన్నా డెల్టాలో 2.47 లక్షల ఎకరాలకు, కనుపూరు కెనాల్ పరిధిలో 63 వేల ఎకరాలు, కావలి కెనాల్ 75 వేల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు రానున్న రోజుల్లో కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది.
- ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో సాగుకు లబ్ధి చేకూరుతుంది.
- నెల్లూరు బ్యారేజ్ నిర్మాణంతో 5 మండలాల్లోని 72 గ్రామాల పరిధిలో 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.
- సర్వేపల్లి కాలువ, జాఫర్‌సాహెబ్ కాలువల పరిధిలోని ఈ ఆయకట్టు పూర్తిగా నీరు అందుతుంది.
- నెల్లూరు నగర తాగునీటి అవసరాలు తీరుతాయి.
రైతు ఇంట సిరులు
వెంకటగిరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెంకటగిరి నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగనిముద్ర వేశారు. మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధిపథంలోకి తెచ్చారు. ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అప్పట్లో జిల్లా మంత్రిగా ఉన్నారు. ఆనం వెంకటగిరి అభివృద్ధికి తోడ్పాటు అందించే దిశగా ఎస్‌ఎస్‌కెనాల్ ఆవశ్యకతను వైఎస్సార్‌కు వివరించి సాధించారు. ఇక నియోజకవర్గంలోని రాపూరు మీదుగా వెళుతున్న వెంకటాచలం – ఓబులవారిపల్లి రైల్వే లైన్ ప్రాజెక్ట్‌పై వైఎస్సార్ ముద్ర ఉంది. దీంతో రాపూరు ప్రాంతం నేడు అభివృద్ధి వైపు పయనిస్తోంది.
వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక వెంకటగిరికి పురపాలక సంఘం హోదా లభించింది. అప్పటి వరకూ తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను సుమారు రూ.72 కోట్లతో మంజూరు చేశారు. మెట్ట ప్రాంతమైన వెంకటగిరి ప్రాంత రైతులను ఆదుకునేందుకు ప్రతిపాదనలు పంపిందే తడువుగా తెలుగుగంగ బ్రాంచ్ కాలువల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. దీంతో బ్రాంచ్ కాలువల ద్వారా సాగునీరు పుష్కలంగా అందుతుండడంతో గతేడాది నుంచి రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతుల ఇంట సిరులు పండాయి.
Comments
Please login to add a commentAdd a comment