సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహానేత వైఎస్సార్ 75వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాయి. రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ సిద్ధం: సజ్జల
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ‘‘ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలం ఎక్కారు. హామీలు ఇచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమల్లో ఉంచటం వైఎస్ జగన్‌కి చేతకాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇళ్ల ముంగిటకే జగన్ పరిపాలన తెచ్చారు. అందరం కలిసి ముందుకు సాగుదాం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దాం. రాష్ట్రానికి, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉంటుంది’’
విశాఖపట్నం: వైఎస్సార్ జయంతి సందర్భంగా బీచ్ రోడ్డులో వైఎస్సార్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మేయర్ హరి వెంకట కుమారి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్తు వంటి గొప్ప పథకాలను మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టారన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు వైఎస్సార్‌ను ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకున్నారు. పేదల కోసం పరితపించిన వ్యక్తి వైఎస్సార్. వైఎస్ ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్ గత ఐదేళ్లు అమలు చేశారన్నారు.
‘‘రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేసిన ప్రజల గుండెల్లో నుంచి ఆయనను వేరు చేయలేరు. టీడీపీ నేతలు ధ్వంసం చేసిన విగ్రహాలన్నీ తిరిగి ఏర్పాటు చేస్తాం. ప్రజలకు అండగా వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది. కూటమి నేతల దాడులను ప్రతిఘటిస్తాం’’ అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
పార్లమెంట్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్టించాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
‘డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) సామాజిక న్యాయం, సాధికారత, పేదల పక్షపాతిగా కోట్లాది మందికి చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ రోజు వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా పార్లమెంట్‌లో డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని స్పీకర్ ఓంబిర్లాకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వైఎస్సార్ శాశ్వత వారసత్వానికి నివాళి అర్పించినట్లు అవుతుంది’ అని ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.
Dr. Y.S. Rajasekhara Reddy (YSR) will forever be remembered by crores as a champion of social justice, and empowerment, and an advocate for the poor. On the occasion of his 75th birth anniversary today, I earnestly appeal to the Hon. Speaker, @ombirlakota ji to install a statue…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 8, 2024
తిరుపతి: వైఎస్సార్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన నివాసం వద్ద వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో పార్టీ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ నగరం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు, దానం నాగేందర్, మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచందర్రావు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా వికోటలో చిత్తూరు జిల్లా చైర్మన్ జీ శ్రీనివాసులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ, సర్పంచ్ పీఎన్ లక్ష్మమ్మ, ఎంపీపీ యువరాజు, రాష్ట్ర కార్యదర్శి పిఎన్ నాగరాజు, వైస్ ఎంపీపీ తమ్మీఖాన్ , వైస్ సర్పంచ్ అక్మల్ , వికోట మహిళా అధ్యక్షురాలు శశికళ, మంజుల, సరస్వతి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో ఎమ్మెల్సీ అనంతబాబు రాజానగరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జక్కంపూడి రామ్మోహన్‌రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రక్తదానం చేశారు. ఈ కార్యక్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు: రాజవొమ్మంగిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించారు.
జనగామ: స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్ర పటానికి కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు కేక్ కట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment