ఎయిమ్స్ వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న మంత్రి విడదల రజిని
సాక్షి, అమరావతి/మంగళగిరి: మంగళగిరిలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిట్టు తెలిపారు. ఎయిమ్స్‌ను సోమవారం మంత్రి సందర్శించి వైద్య విభాగాలు, మౌలిక వసతులను పరిశీలించారు. వైద్య సేవలపై రోగులతో ముచ్చటించారు.
ఎయిమ్స్ అధికారులతో కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేకంగా భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మెంటల్ హెల్త్, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంశాల్లో ఎయిమ్స్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంటుందని, తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని విద్యార్థులకు ఆయా అంశాల్లో ఎయిమ్స్ నుంచి అత్యుత్తమ శిక్షణ లభిస్తుందని తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పాలియేటివ్ కేర్‌గా ఎయిమ్స్‌ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన తోడ్పాటు, సాయాన్ని అందించనున్నట్టు చెప్పారు.
రూ.55 కోట్లతో మౌలిక వసతుల కల్పన
ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఎయిమ్స్‌కు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆత్మకూరు రిజర్వాయర్ నుంచి రూ.7.74 కోట్లతో పైపు లైన్ పనులు సోమవారం నుంచే ప్రారంభించినట్టు మంత్రి రజిని తెలిపారు. తాత్కాలికంగా మంగళగిరి–తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ నుంచి రోజుకు 3.5 లక్షల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నామని, మరో లక్ష లీటర్ల నీటిని అత్యవసర సమయాల్లో వాడుకునేందుకు వీలుగా నిత్యం అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.
సంస్థ విస్తరణలో భాగంగా రోజుకు అదనంగా మరో 3 లక్షల లీటర్ల నీరు అందించాలన్న ఎయిమ్స్ అభ్యర్థన మేరకు.. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి సరఫరా చేస్తున్నామన్నారు. ఎయిమ్స్‌కు మౌలిక వసతుల కల్పనలో సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. రూ.35 కోట్లతో 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, రూ.10 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీ పనులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతుల వరకు తమ ప్రభుత్వమే చేపట్టిందని చెప్పారు. ఇప్పటి వరకు రూ.55 కోట్లను ఎయిమ్స్ అభివృద్ధికి ఖర్చు చేశామని, మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ త్రిపాఠి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment