క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యసిరులు | YSR Aarogyasri Scheme Support To Cancer patients | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యసిరులు

Published Fri, Apr 22 2022 3:55 AM | Last Updated on Fri, Apr 22 2022 3:55 AM

YSR Aarogyasri Scheme Support To Cancer patients - Sakshi

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన శ్రీనుది నిరుపేద కుటుంబం. భార్య పక్షవాతంతో బాధపడుతోంది. కుమార్తె, అల్లుడూ అనారోగ్యంతో బ్బందిపడుతున్నారు. వీరిద్దరి కుమార్తె దేవశ్రీ (5)కు బ్లడ్‌ క్యాన్సర్‌. దీంతో ఈ ముగ్గురి బాధ్యత కూడా శ్రీనుపై పడడంతో అతని ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ సమయంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం మనవరాలి వైద్యానికి అండగా నిలిచింది. పెదకాకానిలోని అమెరికన్‌ ఆంకాలజీ ఆసుపత్రిలో చిన్నారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇప్పటివరకూ రూ.5,21,000లు ప్రభుత్వం ఖర్చుచేసింది. అలాగే, పాప పోషణకు వైఎస్సార్‌ ఆసరా అందుతోంది. ‘మనవరాలి చికిత్సకు అప్పులు చేయాల్సి వస్తుందని భయపడ్డాను. కానీ, ఆరోగ్యశ్రీ ఆదుకుంటోంది’.. అని శ్రీను అంటున్నాడు. 

విశాఖపట్నం నగరానికి చెందిన ఎస్‌. కొండమ్మ (28) కూడా క్యాన్సర్‌తో బాధపడుతోంది. వీరిదీ పేద కుటుంబమే. ఈమెకు కూడా ఆరోగ్యశ్రీ పథకం ఎంతగానో తోడ్పాటు అందించింది. నాలుగు కీమోథెరపీలు జరిగాయి. దీంతో పాటు రూ.11లక్షలతో బోన్‌మారో స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స అందించారు. ఇలా ఏకంగా రూ.18.80 లక్షలు కొండమ్మ చికిత్సకు ప్రభుత్వం ఖర్చుచేసింది. ‘ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే కుటుంబం అప్పులపాలైపోయేది. నా కుటుంబాన్ని ప్రభుత్వం కాపాడింది. నాకు పునర్జన్మ ప్రసాదించింది’.. అని కొండమ్మ అంటోంది. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్న అనేకమంది రోగులకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కొండంత భరోసా ఇస్తోంది. కుటుంబాలు అప్పులపాలు కాకుండా ఆదుకుంటోంది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందిస్తోంది. కానీ, గత టీడీపీ ప్రభుత్వం క్యాన్సర్‌కు మొక్కుబడిగా చికిత్స అందించింది. దీంతో చేతి నుంచి డబ్బు ఖర్చుపెట్టలేక ప్రాణాలు వదులుకున్న వారు అనేకమంది ఉన్నారు. 

పథకంలో 400కు పైగా ప్రొసీజర్స్‌
2019లో అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసింది. ఏకంగా 2,446 ప్రొసీజర్స్‌ను పథకం పరిధిలోకి తెచ్చింది. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్‌ వ్యాధి చికిత్సకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 400కు పైగా క్యాన్సర్‌ ప్రొసీజర్స్‌ను పథకంలో చేర్చారు. దీంతో ప్రస్తుతం అన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధులకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం లభిస్తోంది. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 200 క్యాన్సర్‌ చికిత్స ప్రొసీజర్స్‌ మాత్రమే పథకం కింద ఉండేవి. వీటి నిర్వహణ కూడా అంతంతమాత్రంగా ఉండేది.


మూడేళ్లలోనే రూ.926 కోట్లు ఖర్చు
2014–19 మధ్య టీడీపీ సర్కారు క్యాన్సర్‌ చికిత్సకు రూ.751.56 కోట్లు ఖర్చుచేసింది. రూ.3.18 లక్షల చికిత్సలు అందించారు. కానీ, సీఎం జగన్‌ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ.926.16 కోట్లు ఖర్చుచేసింది. అంటే టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పెట్టిన ఖర్చును మూడేళ్లలోనే అధిగమించి అదనంగా రూ.174.6 కోట్లు వెచ్చించింది. అదే విధంగా 4,16,665 చికిత్సలను ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసింది.

ప్రభుత్వ రంగంలో క్యాన్సర్‌కు కార్పొరేట్‌ వైద్యం
ఇక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం జగన్‌.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని క్యాన్సర్‌ వ్యాధులను తీసుకొచ్చారు. దీంతోపాటు.. మరో అడుగు ముందుకేసి  ప్రభుత్వ రంగంలో క్యాన్సర్‌కు కార్పొరేట్‌ వైద్యం అందించేలా వసతుల కల్పనకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా.. ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్‌ నిపుణులు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్‌)గా ఇటీవల నియమించారు. ఈయన సూచనల మేరకు క్యాన్సర్‌ వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి కసరత్తు చేస్తున్నారు.

ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా ఆదుకుంది
నా భర్త ప్రైవేట్‌ ఉద్యోగి. కొద్ది నెలల క్రితం నాకు రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చు అవుతుందన్నారు. అంత స్తోమతలేక ఆందోళన చెందాం. ఆరోగ్యశ్రీ ఆపద్భాందవిలా ఆదుకుంది. ఇప్పటికి ఏడు కీమోలు మణిపాల్‌ ఆసుపత్రిలో చేశారు. ఆసరా కింద ఏడు విడతలు ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వం చేస్తున్న మేలును మేం మర్చిపోలేం.
– కె. కృష్ణజ్యోతి, క్యాన్సర్‌ బాధితురాలు, మంగళగిరి గుంటూరు జిల్లా 

ఉచితంగా చికిత్స అందించారు
నేను ఇంటి నిర్మాణ కూలిగా పని చేస్తుంటాను. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. నిరుపేద కుటుంబానికి చెందిన మాకు క్యాన్సర్‌ చికిత్స చేయించుకోవడం కష్టతరం. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నా చికిత్సకు రూ.3.72 లక్షలు ఖర్చుచేసింది. ఇంకా చికిత్స జరుగుతోంది. పోషణకు ఆసరా కింద కూడా సాయం చేస్తున్నారు. 
– ఎస్‌.కె. వలి, ఇంటూరు బాపట్ల జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement