సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న పారిశ్రామికవేత్తలు ఇకపై అనుమతుల కోసం శ్రమించాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే యాప్, వెబ్‌పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులు పొందొచ్చు. ఈ మేరకు సరికొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
వైఎస్సార్ ఏపీ వన్ యాప్ ద్వారా 23 రకాల అనుమతులకు ఒకేచోట దరఖాస్తు చేసుకునే వెసులుబాటుని పారిశ్రామికవేత్తలకు కల్పించింది. విశాఖపట్నంలో వైఎస్సార్ ఏపీ వన్ ప్రధాన కేంద్రం ఏర్పాటు చేస్తారు. అలాగే అన్ని జిల్లాల్లో పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉండేలా సబ్ సెంటర్లను నెలకొల్పుతారు. యాప్, పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సోమవారం విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు.
96 క్లియరెన్స్‌లన్నీ ఒక్కచోటే..
పారిశ్రామిక రంగంలో ఇప్పటికే విభిన్న సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతిని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే పరిశ్రమలకు అన్ని అనుమతులు మంజూరు చేయనుంది. మూడు వారాల్లో పరిశ్రమలకు అవసరమైన భూములు కేటాయించనుంది.
వైఎస్సార్ ఏపీ వన్ పోర్టల్ ద్వారా 23 విభాగాలకు సంబంధించిన 96 క్లియరెన్సులన్నీ ఒకే చోట పొందొచ్చు. దీని వల్ల వివిధ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం, వివిధ విభాగాల వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేకుండా పరిశ్రమలకు అనుమతులు లభించనున్నాయి. ఈ ప్రక్రియను కూడా 21 రోజుల్లోనే పూర్తి చేస్తారు.
గతంలో ఇలా..
గతంలో రాష్ట్రంలో ఎవరైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వివిధ విభాగాలకు సంబంధించి మొత్తం 23 అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. వీటికోసం ఆయా విభాగాల వెబ్‌సైట్‌లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఇది చాలా ప్రయాసతో కూడుకుని ఉండటం.. గత టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టిసారించకపోవడంతో పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఇబ్బందుల్ని తొలగించేలా.. అనుమతులన్నీ సులువుగా పొందేలా సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు ప్రత్యేకంగా వైఎస్సార్ ఏపీ వన్ అనే వెబ్‌పోర్టల్‌తో పాటు యాప్‌ని కూడా రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment