సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ బేటీలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నవరత్నాల్లో భాగంగా మరో హామీ అమలు చేసే దిశగానే వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ బేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 1న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం, సెప్టెంబర్ 5న వైఎస్సార్ విద్యాకానుక పథకం, సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా పథకాలకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పాటు పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ కేబినెట్ బేటీలో మంత్రులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్‌లు, షూ, బెల్టు తదితర వస్తువులను 43 లక్షలకు పైగా విద్యార్థులకు అందజేస్తామన్నారు. ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ఎలక్ట్రానికి పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ కంట్రోల్ చట్టాన్ని తీసుకొస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్‌లో అపెక్స్ కౌన్సిల్‌పై కూడా చర్చించినట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి ఇప్పటివరకు రూ.26 వేల 872 కోట్ల రుణాలు అందించామని.. రూ.60 కోట్లతో టొబాకో రైతులను ఆదుకున్నామని మంత్రి నాని వెల్లడించారు.
కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు
►వైఎస్సార్ బీమా కింద సామాజిక భద్రతా పథకం
- ఈ పథకం 18-50 ఏళ్ల మధ్య వారికి వర్తిస్తుంది. సహజ మరణం పొందితే రూ.2లక్షల పరిహారం అందుతుంది.
- శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు
- శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు, 51–70 ఏళ్ల మధ్య వర్తింపు
- రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న సూమారు కోటి 50లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.583.5 కోట్లు ఖర్చు చేయనుంది.
►చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్ పోస్టులు, 14 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
►వైఎస్సార్ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్ పోస్టులు, 8 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం
►విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రంలో దాదాపు రూ.510 కోట్ల వ్యయంతో అదనంగా 2 యూనిట్లు ఏర్పాటుకు ఆమోదం
►వైఎస్సార్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.పులివెందుల సబ్‌డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త సబ్‌డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం.
►రాయచోటిలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకూ ఆమోదం.
►వై.ఎస్సార్ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం
►నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్ ఆమోదం
►రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- 2000 ఎకరాల్లో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్
- బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా
- దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా
►ఏపీఐఐసీ కి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(ఏపీబీడీఐసీ) ఏర్పాటు
►వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించిన మంత్రిమండలి
- రూ.10వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని, 1 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని అంచనా
- క్లస్టర్ల మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.730 కోట్లు ఖర్చు
- ఎలక్ట్రానిక్ రంగంలో కీలక పరిశ్రమలు ఆకట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు
►భావనపాడు పోర్టు కోసం రైట్స్ కంపెనీ డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం
- ఫేజ్ –1 కే దాదాపు రూ. 3669.95 కోట్లు ఖర్చు
- శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మార్చనున్న పోర్టు
- ఉత్తరాంధ్రలో మరో కీలక ప్రాజెక్టు
- తొలి దశలో భాగంగా 2024–25 నాటికి 12.18 ఎంటీపీఏ కార్గోను హేండిలింగ్ చేయాలన్న లక్ష్యం
- 2039–40 నాటికి 67.91 ఎంటీపీఏ కార్గో హేండలింగ్ లక్ష్యం
►ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్( క్వాలిటీ కంట్రోల్ ) యాక్టు-2006 సవరణలపై ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment