అట్లాంటా: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైయస్ఆర్‌సీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. దివంగత మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఇక అమెరికాలో సైతం వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అట్లాంటాలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో విద్యాశాఖమంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని దివంగత మహానేతకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహానేతతో తన అనుబంధాన్ని, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమలు పేదల జీవితాలను ప్రభావితం చేసిన తీరును బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. సమాజం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలి, నిరుపేదలు తమ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లుగా చూడాలని దివంగత వైయస్ఆర్ ఆనాడే తపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలమంది పేద పిల్లలను ఉచితంగా చదివించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్న ఎంతో మంది పిల్లలు నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఎంఎన్‌సీల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తూ జీవితంలో గొప్పగా స్థిరపడ్డారని పేర్కొన్నారు.
దేశానికే ఆదర్శం..
నాడు మహానేత వైఎస్సార్ చదువుల కోసం రెండు అడుగులు వేస్తే నేడు ముఖ్యమంత్రి జగన్ అదే స్ఫూర్తితో నాలుగడుగులు ముందుకు వేశారన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం విద్యను ప్రధాన అంశంగా గుర్తించి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. నాడు-నేడు, డిజిటల్ బోధనలు, విద్యాకానుక, అమ్మఒడి, గోరు ముద్ద వంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవని, ఏపీ విద్యారంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కార్యక్రమం అనంతరం, ప్రవాస ఆంధ్రులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర- దేశ ఆర్ధిక, రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై ఎన్నారైలతో ముచ్చటించారు.
ఆ ఘనత వైఎస్సార్‌దే
కనిగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ, 108 వంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా దివంగత వైయస్ఆర్ ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచారని, పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ఘనత వైయస్ఆర్‌దే అని అన్నారు. ఆయన సంక్షేమ పథకాల స్పూర్తితో మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలూ ఆరోగ్య శ్రీ వంటి పథకాలు ప్రవేశపెట్టాయన్నారు.
వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడు..
ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ విశ్వసనీయతకు, మంచితనానికి మారుపేరు డాక్టర్ వైయస్ఆర్ అన్నారు. 14 ఏళ్ల తర్వాత కూడా ప్రజలకు వైయస్ఆర్ పై ఉన్న అభిమానం చెక్కుచెదర్లేదని, తెలుగు నేలపై ఆయన పేరు, ఆయన ప్రవేశపెట్టిన అజరామరంగా కీర్తింపబడతాయని పేర్కొన్నారు. ఆ మహానేత దారిలోనే ప్రయాణిస్తున్న వైయస్ జగన్ తండ్రిని మించిన తనయుడిగా ఏపీని తీర్చిదిద్దుతున్నారని అన్నారు.
4 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విప్లవాత్మక మార్పులను సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చారని, ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ ఉండటం మన అదృష్టం అని రత్నాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో IIIT మాజీ ప్రిన్సిపాల్ కృష్ణా రెడ్డి వైయస్ఆర్ గొప్పతనాన్ని పద్యరూపంలో చెప్పడం అలరించింది. సీఎం సలహాదారు ( విద్య ) కుమార్ అన్నవరపు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అట్లాంటాలో నివాసముంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: స్మృత్యంజలి
Comments
Please login to add a commentAdd a comment