గంగపుత్రులకు ఏదీ భరోసా? | YSR Matsyakara Bharosa Scheme: YS Jagan government increased it from Rs 4 thousand to Rs 10 thousand | Sakshi
Sakshi News home page

గంగపుత్రులకు ఏదీ భరోసా?

Published Sun, Jun 30 2024 6:20 AM | Last Updated on Sun, Jun 30 2024 6:20 AM

YSR Matsyakara Bharosa Scheme: YS Jagan government increased it from Rs 4 thousand to Rs 10 thousand

ఐదేళ్లూ గడువులోగానే మత్స్యకార భరోసా

రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచిన జగన్‌ ప్రభుత్వం

ఏటా సగటున 1.16 లక్షల మందికి వేట నిషేధ భృతి

ఐదేళ్లలో రూ.538 కోట్లు జమ చేసి అండగా నిలిచిన పరిస్థితి

ఎన్నికల బిజీలో కూడా గడువులోగా భరోసా ఇవ్వాలని యత్నం

ఆర్బీకేల ద్వారా 1.30 లక్షల మంది అర్హుల గుర్తింపు

సామాజిక తనిఖీల కింద సచివాలయాల్లో జాబితాల ప్రదర్శన

ఎన్నికల కోడ్‌ సాకుతో ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకున్న కూటమి నేతలు

అధికారంలోకి రాగానే రూ.20 వేలు భృతి ఇస్తామని మేనిఫెస్టోలో హామీ

ఆ మేరకు రూ.260.26 కోట్ల బడ్జెట్‌ కోసం మత్స్యశాఖ ప్రతిపాదనలు

గడువు ముగిసి రెండు వారాలవుతున్నా పట్టించుకోని ప్రభుత్వం

సాక్షి, అమరావతి : వేసవిలో చేపలు గుడ్లు పెట్టే సమయంలో ఏటా 61 రోజుల పాటు వేట నిషేధం అమలవుతుంది. ఈ సమయంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు. వేట తప్ప వారికి మరో వృత్తి చేతకాదు. వేటకు వెళ్తే కానీ పూట గడవని బతుకులు వారివి. వేట మీద ఆధారపడి జీవనోపాధి పొందే ప్రతీ మత్స్యకారునికి నిషేధ కాలంలో కుటుంబ పోషణ కోసం చాలా ఏళ్లుగా వేట నిషేధ భృతిని ప్రభుత్వం అందిస్తోంది.

గత ఐదేళ్లుగా వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి రూ.10 వేల చొప్పున భరోసా ఇవ్వగా, తాము అధికారంలోకి రాగానే రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. వేట గడువు ముగిసినప్పటికీ నిషేధ భృతి చేతికి అందక మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

ఐదేళ్లూ గడువులోగానే మత్స్యకార భరోసా 
వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు పూర్వం రూ.2 వేలు, బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇచ్చే వారు. ఆ తర్వాత నిత్యావసరాలకు పుల్‌స్టాప్‌ పెట్టి రూ.4 వేల చొప్పున భృతి ఇచ్చారు. అది కూడా వేట నిషేధం ముగిసిన తర్వాత ఆర్నెల్లకో ఏడాదికో ఎప్పుడిచ్చేది కూడా తెలిసేది కాదు.  పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచి నిషేధ కాలంలోనే పార్టీలు, కులాలు, మతాలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇచ్చి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లకే కాకుండా.. తెప్పలు ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ సాయాన్ని వర్తింప చేసింది. 2014–19 మధ్య ఏటా సగటున 60 వేల మందికి ఐదేళ్లలో రూ.104.62 కోట్లు జమ చేయగా, 2019–24 మధ్య ఏటా సగటున 1.16 లక్షల మంది మత్స్యకారులకు ఐదేళ్లలో రూ.538 కోట్లు జమ చేశారు. 

ఎన్నికల వేళ.. గడువులోగా ఇచ్చేలా
ఎన్నికల వేళ క్షణం తీరక లేని పరిస్థితుల్లో సైతం గత ఐదేళ్ల మాదిరిగానే వేట నిషేధ సమయంలో అర్హులైన ప్రతీ మత్స్యకారునికి వేట నిషేధ భృతిని అందించాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేసింది. తొలుత ఎన్నికల కోడ్‌ సాకుతో అర్హుల గుర్తింపును విపక్షాలు అడ్డుకోగా, నిషేధ సమయంలోనే వారికి ఈ సాయం అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు పలుమార్లు లేఖలు రాసింది. ఫలితంగా ఈసీ అనుమతితో మే 2వ తేదీ నుంచి తీర ప్రాంత గ్రామాల్లో ఆర్బీకేల ద్వారా అర్హుల గుర్తింపు చేపట్టింది.

2023–24 సీజన్‌లో 1.23 లక్షల మంది అర్హత పొందితే, 2024–25 సీజన్‌లో 1,30,128 మంది అర్హత పొందారు. సామాజిక తనిఖీల్లో భాగంగా అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శనకు సైతం పెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి చెల్లించేందుకు రూ.260.26 కోట్లు అవసరమని మత్స్య శాఖ ప్రతిపాదనలు పంపింది. గడువు ముగిసి రెండు వారాలు కావస్తున్నా, మత్స్యకార భరోసా ఇచ్చే విషయంలో ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తుండడం పట్ల మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాలా ఇబ్బంది పడ్డాం
వేట నిషేధంలో సమయం అందే మత్స్యకార భరోసా ఈ సంవత్సరం వేట నిషేధం ముగిసినప్పటికీ జమ చేయలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది వేట నిషేధ గడువు ముగిసి 15 రోజులు కావస్తున్నా, ఎలాంటి సాయం అందించలేదు. ప్రస్తుతం సరైన వేట లేక, పూట గడవక చాలా ఇబ్బంది పడుతున్నాం.  – వై రాజు, మత్స్యకారుడు, అమీనాబాద్, కాకినాడ జిల్లా

అప్పులు చేసి తినాల్సి వచ్చేది
మాకు వేట తప్ప మరో పనిరాదు. వేట నిషేధ సమయంలో పిల్లాపాపలతో ఇంటికి పరిమితం అవ్వాల్సి వస్తుంది. ఆ రెండు నెలలు కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంటుంది. వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయంతోనే ఇల్లు గడుస్తుంది. ఐదేళ్లుగా ఇదే రీతిలో సాయం అందింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేలు నిషేధ గడువు ముగియక ముందే ఇచ్చి ఉంటే బాగుండేది. ఈసారి అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వచ్చింది. – అర్జిల్లి రామకృష్ణ, వెంకటనగరం, అనకాపల్లి జిల్లా

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
గతంలో రూ.4 వేలు చొప్పున ఇచ్చే వేట నిషేధ భృతిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచి, ఏటా క్రమం తప్పకుండా నిషేధ సమయంలోనే జమ చేసేది. పైగా మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లకే కాదు.. తెప్పలు, ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ సాయాన్ని అందించింది. మత్స్యకారుల సంక్షేమానికి తాము పెద్దపీట వేస్తామని ఎన్నికల వేళ టీడీపీ కూటమి నేతలు హామీలిచ్చారు. తాము అధికారంలోకి రాగానే రూ.20 వేలు ఇస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకొని ప్రతి మత్స్యకారునికి భృతి 
అందించాలి.      – ఆవల శ్రీను, మత్స్యకారుడు, విజయలక్ష్మీపురం, బాపట్ల జిల్లా

ఎప్పుడు ఇస్తారో చెప్పండి
ఐదేళ్లుగా ఏటా చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా కింద రూ.10 వేలు చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు జమయ్యేది. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి భృతి చెల్లింపులో ఆలస్యం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరినా భృతి చెల్లింపునకు కనీసం చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడు చెల్లిస్తారో తేదీ ప్రకటించాలి. – చిన్నపిల్లి నీలయ్య, మత్స్యకారుడు, చింతపల్లి, పూసపాటిరేగ మండలం, విజయనగరం జిల్లా

అనుమానంగా ఉంది
చంద్రబాబు ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసా రూ.20 వేలు ఇస్తానని వాగ్దా­నం చేశారు. కానీ వేట నిషేధ కాలం ము­గిసినా ఇంత వరకు మత్స్యకార భరోసాపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీంతో మత్స్యకార భరోసా ఇస్తారా, ఇవ్వరా అని సంది
గ్ధంగా ఉంది.     – వాయిల యానాదిరావు, చెల్లెమ్మగారి పట్టపుపాలెం, పాకల పంచాయతీ, ప్రకాశం జిల్లా

అనుమానంగా ఉంది
చంద్రబాబు ఎన్నికల సమయంలో మత్స్యకార భరోసా రూ.20 వేలు ఇస్తానని వాగ్దా­నం చేశారు. కానీ వేట నిషేధ కాలం ము­గిసినా ఇంత వరకు మత్స్యకార భరోసాపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీంతో మత్స్యకార భరోసా ఇస్తారా, ఇవ్వరా అని సంది
గ్ధంగా ఉంది.     – వాయిల యానాదిరావు, చెల్లెమ్మగారి పట్టపుపాలెం, పాకల పంచాయతీ, ప్రకాశం జిల్లా

ఎదురు చూస్తున్నాం
మత్స్యకార భరోసా సొమ్ము మా ఖాతాల్లో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాం. గత ఐదేళ్లూ చెప్పిన తేదీన ఇచ్చారు. పని లేక ఖాళీగా ఇంట్లో కూర్చున్నప్పుడు సొమ్ము రావడంతో ఏ ఇబ్బందీ ఉండేది కాదు. కూటమి సర్కార్‌ వస్తే మత్స్యకార భరోసా ఇంకా ఎక్కువగా ఇస్తామన్నారు. కానీ ఇంత వరకు ఎవరూ స్పందించ లేదు.  – తిరుమాని దేవేంద్రరాజు, మత్స్యకారుడు, వేములదీవి వెస్ట్‌ గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా

వెంటనే సాయం అందజేయాలి
మత్స్యకారులకు వేటే జీవనాధారం. రెండు నెలలు వేట విరామ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అప్పులు చేశాం. ఇప్పుడు ఆ అప్పు తీర్చాలంటే భృతి రూ.20 వేలు వెంటనే ఇవ్వాలి. ప్రస్తుతం వేట నిషేధం పూర్తయినా ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. వెంటనే భృతిని అందజేసి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలి. – గండుపల్లి హరిదాసు, చేపల గొల్లగండి, సోంపేట మండలం, శ్రీకాకుళం గ్రామం

వేటకు వెళ్లే ప్రతి ఒక్కరికి రూ.20 వేలు ఇవ్వాలి
సబ్సిడీ ఆయిల్‌ వినియోగంతో ముడి పెట్టకుండా మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లపై వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇవ్వాలి. గత ఐదేళ్లుగా వేట నిషేధ సమయంలోనే క్రమం తప్పకుండా మత్స్యకార భరోసా ఇచ్చారు. అదే రీతిలో నిషేధ సమయంలోనే భృతిని అందించి అండగా నిలవాలి.  – వాసుపల్లి జానకీరాం, అధ్యక్షుడు, ఏపీ మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోటు ఆపరేటర్ల సంఘం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement