షర్మిల, సునీతపై వైఎస్సార్ సోదరి విమలమ్మ
వైఎస్సార్ శత్రువుల చేతుల్లో వాళ్లు కీలుబొమ్మలయ్యారు
వైఎస్ కుటుంబ పరువును రోడ్డుకీడుస్తున్నారు.. వైఎస్ ఇంటి ఆడపడుచుల తీరు అన్యాయంగా ఉంది
వారిద్దరూ నోరుమూసుకోవాలి.. ఇంటి ఆడపడుచుగా నేను చెబుతున్నా
వివేకానందరెడ్డి హత్యతో అవినాశ్, భాస్కర్‌రెడ్డిలకు సంబంధంలేదు
హత్య చేసిన దస్తగిరి మాత్రం దర్జాగా తిరుగుతున్నాడు.. అతని మాటలు విని అవినాష్‌ను వేధిస్తారా
షర్మిల, సునీత ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలి.. ప్రజలకు మంచిచేసే జగన్ మళ్లీ సీఎం కావాలి
మీడియాతో వైఎస్సార్ సోదరి విమలమ్మ
సాక్షి, అమరావతి: ‘వైఎస్ కుటుంబ ఆడపడుచులు షర్మిల, సునీత అన్యాయంగా మాట్లాడుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబ గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. నేనూ వైఎస్ కుటుంబ ఆడపడుచునే. వివేకానందరెడ్డి అందరికంటే నాకే ఎక్కువ సన్నిహితుడు. ఆ కుటుంబ ఆడపడుచుగా చెబుతున్నా.. మా అన్నయ్య వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఎంపీ అవినాష్‌రెడ్డికిగానీ వైఎస్ భాస్కర్రెడ్డికిగానీ ఎలాంటి సంబంధంలేదు’.. అని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సోదరి విమలమ్మ విస్పష్టంగా ప్రకటించారు. ‘కొంగు పట్టుకుని షర్మిల ఓట్లు అడుగుతున్న వీడియో చూసి చాలా బాధపడ్డాను.
వైఎస్ కుటుంబ పరువును ఆమె రోడ్డుకీడుస్తున్నారు. ఆమెలో నాయకత్వ లక్షణాల్లేవు. నిత్యం వైఎస్ అవినాష్‌ను విమర్శిస్తున్నారు. అతను హత్యచేయడంగానీ చేయించడంగానీ వాళ్లు చూశారా? సీఎం జగన్‌పై కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరు హత్యచేశారో షర్మిల, సునీతే నిర్ణయించేస్తే ఇక కోర్టులు, జడ్జీలు ఎందుకు?’ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. విజయవాడలో శనివారం విమలమ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ఇలా సూటిగా స్పందించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్ శత్రువుల చేతుల్లో కీలుబొమ్మలుగా షర్మిల, సునీత..
వైఎస్ రాజశేఖరరెడ్డి శత్రువులంతా ఒక్కటయ్యారు. ఈ తరుణంలో వైఎస్ కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండాలి. కానీ, వైఎస్ శత్రువుల చేతుల్లో షర్మిల, సునీత కీలుబొమ్మలయ్యారు. వాళ్లిద్దరి చూట్టూ ప్రస్తుతం వైఎస్ కుటుంబ శత్రువులే ఉన్నారు. షర్మిల, సునీతలకు చెబుతున్నా.. వారు నోరు మూసుకోవాలి. పేద ప్రజలకు మంచి చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం సరికాదు.
వారిద్దరూ ఎందుకిలా చేస్తున్నారో అర్థంకావడంలేదు. డబ్బు కోసమో పదవి కోసమే తెలీడం లేదుగానీ అసూయ, ద్వేషంతో వ్యవహరిస్తున్నారు. ఏదో ఆశించే ఇదంతా చేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక బంధువులు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని దూరం పెట్టారు. వాళ్ల పనులు కావడంలేదనే ఇలా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. వారికి మంచి చెప్పాలని చూశాను. అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశారు.
హంతకుడు దస్తగిరి దర్జాగా తిరుగుతున్నాడు..
షర్మిల, సునీత తామేది మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారు. మా ఇంట్లో అమ్మాయిలు ఇలా అన్యాయంగా మాట్లాడుతుంటే బాధ కలుగుతోంది. వివేకానందరెడ్డిని కిరాతకంగా హత్యచేశాను అని చెప్పిన దస్తగిరి మాత్రం బయట దర్జాగా తిరుగుతున్నాడు. అతని మాటలు నమ్మి అవినాష్‌రెడ్డిని విమర్శిస్తారా? ఏ తప్పూ చేయని వైఎస్ భాస్కర్‌రెడ్డి ఏడాదిగా జైల్లో ఉన్నారు. అవినాష్ బెయిల్ రద్దుచేయాలని షర్మిల, సునీత కోర్టులో కేసులు వేశారు. కానీ, వివేకాను హత్యచేశాను అని చెప్పిన దస్తగిరి బెయిల్‌పై ఉన్నా వారెందుకు పట్టించుకోవడంలేదు? షర్మిల, సునీత ఎన్ని మాటలంటున్నా అవినాష్ ఒక్క మాటా కూడా అనడంలేదు.
వైఎస్‌కు వివేక ఎలాగో.. జగన్‌కు అవినాశ్ అలా..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చూసేవారు. అందుకే పులివెందుల, కడప జిల్లాలో పార్టీ బాధ్యతలను వివేకాకు అప్పగించారు. వారిద్దరిలో ఒకరు ఎంపీగా పోటీచేస్తే మరొకరు ఎమ్మెల్యేగా పోటీచేసేవారు. అలా ఓటమి అన్నది లేకుండా గెలుస్తూ వచ్చారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వివేకానందరెడ్డి ఎలానో ప్రస్తుతం వైఎస్ జగన్‌కు వైఎస్ అవినాశ్ అలా అండగా ఉన్నారు. కానీ, వైఎస్ హఠాన్మరణం తర్వాత మారిన పరిస్థితుల్లో వైఎస్ జగన్ తన తండ్రి ఆశయ సాధన కోసం పార్టీ పెట్టారు.
దురదృష్టవశాత్తూ ఆనాడు వివేకానందరెడ్డి కాంగ్రెస్ వైపు ఉండిపోయారు. ఆ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా జగన్ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సి వచ్చింది. అందుకే పులివెందుల, కడప జిల్లాల్లో పార్టీ బాధ్యతలను చూసుకునేందుకు అవినాష్‌రెడ్డిని ఎంపిక చేసుకున్నారు. దీంతో అవినాష్ తనపై పెట్టిన బాధ్యతను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. పులివెందులను, కడప జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు. అసలు అవినాష్‌ను ఎంపీగా గెలిపించాలనే వివేకానందరెడ్డి చివరివరకూ ప్రచారం చేశారు కదా.
ఈ విషయాన్ని గుర్తించయినా షర్మిల, సునీత అవినాష్ మీద దుష్ప్రచారాన్ని మానుకోవాలి. ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌కు అండగా నిలవాలి. వారిద్దరూ మరోసారి కూర్చుని చర్చించి జగన్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే జగన్ శత్రువులంతా ఒక్కటయ్యారు. బయట శత్రువులంతా ఒక్కటైతే కుటుంబం అంతా కలిసికట్టుగా ఉండి ఎదుర్కోవాలి. ఆ కుటుంబ ధర్మాన్ని పాటించాలని షర్మిల, సునీతలకు సూచిస్తున్నా.
జగన్‌ను మళ్లీ సీఎంను చేయండి..
ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్నారు. వైఎస్, వివేకా ఇద్దరూ ఫ్యాక్షన్ రాజకీయాలకు వ్యతిరేకం. మా నాన్నను హత్యచేసిన తరువాత కూడా ఎలాంటి ప్రతికార రాజకీయాలకు పాల్పడకుండా వారు ఫ్యాక్షన్‌ను అంతంచేశారు. కానీ, ప్రశాంతంగా ఉన్న పులివెందులలో ప్రస్తుతం కొందరు అల్లర్లు రేకెత్తించేందుకు యత్నిస్తుండటం బాధ కలిగిస్తోంది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సాధించేందుకు జగన్ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. పేద ప్రజలకు అంత మంచి చేస్తున్న జగన్ మరోసారి సీఎం కావాలి. అందుకోసం రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అందరినీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment