సాక్షి,పశ్చిమగోదావరి:పారిశ్రామిక విధానం, గొప్ప ముఖ్యమంత్రి ఉన్నారన్న భరోసాతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కారుమూరి స్పందిస్తూ.. దేశంలో అతి పెద్ద రెండో తీరప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం.. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నారన్నారు.
రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులే పెట్టుబడిదారులను ఏపీ వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఊహించని రీతిలో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. చంద్రబాబు లాగా మసిపూసి మారేడు కాయ చేయడం లేదని, ఆయన హయాంలో లాగా హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పనిచేసే సిబ్బందికి సూట్లు, కోట్లు తగిలించి దొంగ ఒప్పందాలు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అంబానీ,ఆదానీ,అపాచీ మిట్టల్, జెఎస్డబ్ల్యు, జిఎంఆర్ తదితర బడా పారిశ్రామిక వేత్తలు వాస్తవ ఒప్పందాలు జరిగాయని చెప్పుకొచ్చారు. భావి తరాలకు చక్కని విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగాల కోసం సీఎం జగన్ బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment