సాక్షి, అమరావతి: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ అలుపులేని పోరాటం చేస్తోందని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాజ్యసభలో తాము ఇప్పటికే ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. బీసీల హక్కుల కోసం పార్లమెంట్‌లో పోరాడే బాధ్యతను వైఎస్సార్‌సీపీ తీసుకుందన్నారు.
బీసీ సామాజిక వర్గాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి వారి ప్రయోజనాలను కాపాడే వైఎస్సార్ సీపీని 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చి వైఎస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని సీఎస్సార్ కళ్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ బీసీ ఆతీ్మయ సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా బీసీ సదస్సులు
బీసీ సామాజిక వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తూ మూడున్నరేళ్లుగా చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే బీసీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా 225 మంది బీసీ ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశాన్ని కోర్ కమిటీ భేటీగా పరిగణిస్తున్నాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో బీసీ నాయకులందరిని కూడగట్టి పది రోజుల్లో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తాం. అనంతరం 26 జిల్లాల్లో బీసీసదస్సులు జరుగుతాయి.
నేరుగా రూ.2 లక్షల కోట్లు..
టీడీపీ హయాంలో ఐదేళ్లలో బీసీల కోసం రూ.19,369 కోట్లు ఖర్చు చేయగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో నేరుగా నగదు బదిలీ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు దాదాపు రూ.2 లక్షల కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసింది.
కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల దాకా..
సామాజిక న్యాయానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు. మొత్తం 137 కార్పొరేషన్లకు సంబంధించి 484 పదవులు కేటాయించగా 243 బీసీలకే దక్కాయి. బీసీలకు 56 కార్పొరేషన్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే అందులో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే దక్కాయి. సచివాలయాల్లో 2.7 లక్షల వలంటీర్ ఉద్యోగాలతో పాటు మిగతావి కూడా కలిపి 6.03 లక్షల ఉద్యోగాలను సృష్టించగా 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకే ఇచ్చాం. రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కలిపి మొత్తం 2,61,571 ఉద్యోగాలను బీసీలకే ఇచ్చాం.
మహిళా సాధికారత..
మంత్రిమండలిలో 70% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే సీఎం జగన్ చోటు కల్పించారు. మంత్రివర్గం నుంచి నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు.. ఇలా అన్నింటిలోనూ రిజర్వేషన్లు కల్పించారు. డిప్యూటీ సీఎం పదవులు ఐదుగురికి ఇస్తే 80% బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టలకే దక్కాయి. స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్, పదవుల్లో బీసీలు, ఎస్సీలకే అవకాశం కల్పించాం.
మండలి డిప్యూటీ చైర్మన్‌గా మైనార్టీ మహిళను నియమించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం. నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లను సీఎం జగన్ కల్పించారు. ఇదే రీతిలో చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని అధ్యక్షతన జరిగిన ప్రతి అఖిలపక్ష సమావేశంలోనూ వైఎస్సార్‌సీపీ తరఫున డిమాండ్ చేశాం. పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టాం.
బాబు దృష్టిలో బానిస క్లాస్...
బీసీలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బానిస క్లాస్‌గా పరిగణిస్తారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాయీ బ్రాహ్మణులు తమ సమస్యలు చెప్పుకునేందుకు సచివాలయానికి వస్తే తోకలు కత్తిరిస్తానని బెదిరించి అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా ఉండటానికి వీల్లేదంటూ 2017 మార్చి 21న కేంద్రానికి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబే.
Comments
Please login to add a commentAdd a comment