
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిశారు. వారికి సీఎం వైఎస్ జగన్.. బీఫామ్ పత్రాలను అందజేశారు. ఆరుగురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేయనున్నారు. ఇక్బాల్, కరీమున్నీసా, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథ, దువ్వాడ శ్రీనివాస్, సి.రామచంద్రయ్య నామినేషన్లు వేయనున్నారు. 5 సాధారణ ఖాళీలు, ఒక స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్ సీపీ ప్రాధాన్యం కల్పించింది. త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అంతేగాక ఇచ్చిన మాటకు సీఎం వైఎస్ జగన్ కట్టుబడిన తీరు అభ్యర్థుల ఎంపికలో కనిపిస్తోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఆయన కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తికి ఎస్సీ సామాజిక వర్గం కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అదేరీతిలో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుటుంబానికే తిరిగి అవకాశమిచ్చారు.
ముందే ఇచ్చిన హామీ మేరకు రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డిని సీఎం ఎంపిక చేశారు. మరోవైపు మైనారిటీ వర్గానికి ప్రాధాన్యమిచ్చారు. ఆ వర్గానికి చెందిన కరీమున్నీసా, మహ్మద్ ఇక్బాల్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. హిందూపురం సమన్వయకర్త ఇక్బాల్ గత ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయనకు రెండోసారి అవకాశం కల్పించారు. శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్‌కు న్యాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. బీసీ కోటా కింద ఆయనను ఖరారు చేసిన సంగతి విధితమే.
Comments
Please login to add a commentAdd a comment