కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌కు వినతి పత్రం ఇస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 29 రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి బిజ్లీ క్రాంతి యాత్ర పేరుతో ఢిల్లీ చేరుకున్న వేలాది మంది విద్యుత్ ఉద్యోగులు బుధవారం జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
విద్యుత్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలని విద్యుత్ ఉద్యోగులు నినాదాలిచ్చారు. ఈ భారీ ధర్నాకు వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, సీపీఎం ఎంపీ ఎలమరం కరీం, సీపీఐ నేత డి.రాజా, సహా వివిధ పార్టీల నాయకులు, ట్రేడ్ యూనియన్, ప్రజా సంఘాల నేతలు హాజరై మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే 28 లక్షల మంది ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తారని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ప్రైవేటీకరణ చేస్తే భవిష్యత్తులో రైతులకు ఉచిత కరెంట్ లభించదని, ఒక్కో రైతు ప్రతి వ్యవసాయ పంపు సెట్టుకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు చార్జీలు కట్టాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రైవేటీకరణతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉండదని, దీంతో 25 లక్షల మంది ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం పొంచిఉందని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించొద్దని తీర్మానాలు చేశాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్‌పరం చేసిందని.. ఇంకా చేయాలని చూస్తే ప్రజలు ఎదురు తిరుగుతారని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. పార్లమెంటులో విద్యుత్ ఉద్యోగుల సమస్యపై కేంద్రంతో పోరాడతామని స్పష్టం చేశారు.
బీసీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌ను పెంచాలి
బీసీల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, ఉద్యోగ, శిక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం ఉదయం ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, చంద్రశేఖర్, మోక్షిత్ తదితరులు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు.
దేశమంతా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలు అమలు చేయాలని ఆర్.కృష్ణయ్య కేంద్రమంత్రి వీరేంద్ర కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు కేంద్ర బడ్జెట్‌లో కేవలం రూ.1,400 కోట్లు కేటాయించి 56 శాతం జనాభాను అవమానించారని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment