సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్లాంట్ ఉద్యోగులు, ప్రజాసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నాయకులు బుధవారం టీడీఐ జంక్షన్ వద్ద భారీగా నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ, మంత్రి అవంతి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అదీప్‌రాజు, ఐఎన్‌టీయూసీ నేత మంత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. అదే విధంగా లెఫ్ట్ పార్టీ నేతలు నరసింగరావు, సత్యనారాయణ, ట్రేడ్ యూనియన్ నేతలు హాజరయ్యారు. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి తన చేపట్టబోయే నిరసన కార్యక్రమాల కార్యాచరణను ప్రకటించింది.
ఈనెల 12న విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఐఎస్‌టీయూసీ పేర్కొంది. కూర్మన్నపాలెంలో వేలాది మంది కార్మికులతో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపింది. 18న స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, భార్యా పిల్లలతో నిరసన కార్యక్రమం చేపడతామని ప్రకటించింది. కేంద్రం ఆధ్వర్యంలోనే స్టీల్‌ప్లాంట్ కొనసాగాలని, వేలాది మంది భూముల త్యాగంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పడిందని ఐఎన్‌టీయూసీ డిమాండ్ చేసింది.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు:
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాజకీయాలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని మొదటి నుంచి చెప్తున్నామని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకూడదన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
రాజకీయాలకతీతంగా ఉద్యమించి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలని స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రైవేట్‌పరం చేయాలనే ఉద్దేశంతో సొంత గనులు ఇవ్వలేదని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి లేఖ రాసి, సూచనలు చేశారని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం కార్మిక సంఘాలతో కలిసి పోరాడతామని, అన్ని కార్మిక సంఘాలను ఢిల్లీ తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ కోరతామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment