పల్లెల్లో టీడీపీ అభ్యర్థి ఎవరో కూడా తెలియని వైనం
నామమాత్రంగా ప్రచారం ముగింపు
నిస్తేజంలో టీడీపీ క్యాడర్
బి.కొత్తకోట: ఏ ఎన్నికై నా బరిలో నిలిచే అభ్యర్థి, ఆ పార్టీ యంత్రాంగం విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతారు, విజయమో, వీరస్వర్గమో అన్నంతగా ప్రత్యర్థులతో తలపడతారు. అయితే ప్రస్తుతం తంబళ్లపల్లెలో టీడీపీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. టీడీపీ చరిత్రలో ఎన్నడూ చూడని దయనీయమైన ప్రస్తుత పరిస్థితిని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతోంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డితో తలపడే స్థితిలో లేని టీడీపీ ఓటింగ్‌కు ముందే అస్త్ర సన్యాసం చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎక్కడా ప్రచార ఆర్భాటాలు లేవు, ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయమన్న అభ్యర్థనలు లేవు. సోమవారం ఓటింగ్ జరగనుండగా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్ల కోసం క్యాడర్ పని చేయడమూ లేదు. దీనితో ఓటింగ్‌కు ముందే టీడీపీ ఓటమి పాలైందా అన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది.
అభ్యర్థి ఎవరో తెలియదు
టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాలోనే తంబళ్లపల్లె అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును చంద్రబాబు ఫిబ్రవరి 24న ప్రకటించారు. రాజకీయాలకు, టీడీపీకి కొత్త అయిన అయన్ను చూడాలని పల్లెల్లోని ఓటర్లు ఎదురుచూశారు. ఆరు మండలాల్లో 1,200లకుపైగా పల్లెలు ఉన్నాయి. ఎన్నికల ప్రచారం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రతిపల్లెకు తారురోడ్లు నిర్మించారు. అయినప్పటికి ఇందులో సగం పల్లెల్లోనైనా టీడీపీ అభ్యర్థి ప్రచారం జరగలేదు. ప్రచారానికి వెళ్లినా కొద్దిసేపటికే ముగిస్తారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు టీడీపి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి. ఓటర్లతో కనీస పరిచయాలు లేకపోవడం, తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం మిగతా కులాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వారం–పదిరోజులుగా టీడీపీ ప్రచారమే కనిపించడం లేదు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మొదట్లో జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినా ఆ తర్వాత ఆయనకు దగ్గరయ్యారు. కానీ శంకర్ వర్గాన్ని గుర్తించకపోవడంతో అభ్యర్థి తీరుపై అసంతృప్తితో వారు దూరమయ్యారు.
అయిష్టంగానే కిరణ్
టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని మార్చేవరకు తంబళ్లపల్లెలో అడుగుపెట్టను అని చెప్పిన బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి చివరకు సర్దుకుపోయారు. నియోజకవర్గ పర్యటనల్లో జయచంద్రారెడ్డితో కలిసి కిరణ్ అయిష్టంగానే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనికితోడు కిరణ్ వర్గీయుల ప్రచారంలో ఎంపీ అభ్యర్థికి మాత్రమే ఓట్లు వేయాలని కోరుతుండటం గమనార్హం.
చంద్రబాబు హెచ్చరించినా
టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని చంద్రబాబు రెండుసార్లు హెచ్చరించినా ఆర్థిక వనరులను సమకూర్చుకునే విషయంలో చేతులెత్తేసినట్టు తెలిసింది. దీంతో చంద్రబాబు కూడా తంబళ్లపల్లెలో టీడీపీ గెలుపు అవకాశాలపై ఆశలు వదులుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఎన్నికలకు క్యాడర్ దూరం
సోమవారం జరిగే ఎన్నికలకు మెజారిటీ టిడీపీ క్యాడర్ దూరంగా ఉంటోంది. గెలుపునకు పనిచేయాలని అభ్యర్థి జయచంద్రారెడ్డి నుంచి పిలుపు లేకపోవడంతో ముఖ్యమైన నేతలు, మండలస్థాయి నాయకులు నిస్తేజంగా ఉండిపోయారు. ఎన్నికల్లో పనిచేసేందుకు కనీస ఖర్చులు భరించకుంటే ఓటర్లను కలిసి ఎలా ఓట్లు అడుగుతామని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment