మరిచారా బాబూ.!
పథకాల పేర్ల మార్పులో రాయలసీమపై వివక్ష!
కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న మేధావులు
మిగతా పథకాలకై నా ‘సీమ’వాసులకు స్థానం కల్పించాలి
సీమ ముద్ద బిడ్డను..
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాలకు పేర్లు మార్చడం సహజం. తమ పార్టీ నాయకులు లేదా నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే జాతీయ నాయకుల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టడం పరిపాటి. ఇదే కోవలో తాజాగా రాష్ట్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వివిధ పథకాల పేర్లు మార్చింది. అందులో జగనన్న గోరుముద్ద పథకానికి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’అని పేరు మార్చంది. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టి ఆదుకున్న డొక్కా సీతమ్మ పేరుపై ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. ఊళ్లకు ఊళ్లు కరువు బారిన పడి ప్రజలు మృత్యు ముఖంలోకి జారుతున్న విషాద సమయంలో తన ఆస్తుల్ని ధాన్యంగా మార్చి వేలాది పేదల కడుపు నింపి ప్రాణాలు కాపాడిన పూర్వపు కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామ వాసి బుడ్డా వెంగళరెడ్డి పేరు ప్రభుత్వానికి ఎందుకు స్ఫురణకు రాలేదని ఇక్కడి మేధావి వర్గం ప్రశ్నిస్తోంది.
దాతృత్వానికి మరో పేరు వెంగళరెడ్డి
1866లో రాయలసీమను భయంకర కరువు ఒకటి కబళించింది. ప్రజలు దాన్ని ఎర్రగాలి కరువు అని పిలిచేవారు. తినడానికి తిండి లేక, తాగేందుకు గుక్కెడు నీరు సైతం కరువై ప్రజలు డొక్కలు ఎండి అస్థిపంజరాలుగా మారారు. కలరా, మశూచి, బోవెల్ వ్యాధులు విజృంభించి వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. కడుపు చేతపట్టుకుని వలసలు వెళ్లడంతో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయ్యాయి. ఈ తరుణంలో బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం గురించి ఆ నోటా ఈ నోటా విన్న బళ్లారి, అనంతపురం, కడప జిల్లాల ప్రజలు ఉయ్యాలవాడ గ్రామానికి చేరుకోవడం ప్రారంభించారు. అలా వేల సంఖ్యలో వచ్చిన కరువు బాధితులతో గ్రామం కిటకిటలాడింది. వెంగళరెడ్డి తాము నిల్వ ఉంచిన 12 పాతర్ల ధాన్యం అంటే 1440 బస్తాలు ఖర్చు చేసి పూటకు ఎనిమిది వేల మందికి చొప్పున అన్నం, అంబలి వంటివి అందజేసి ప్రాణాలు నిలిపారు. చివరికి తన భూములు అమ్మి అన్నదాన యజ్ఞాన్ని కొనసాగించారు. అలా మూడు నెలలకు పైగానే ఈ కార్యక్రమం నడిచింది. కరువు వల్ల తమ ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయలేకపోయారని తెలుసుకున్న వెంగళరెడ్డి తాళిబొట్లు, ముక్కెరలు దానం చేశారు. వర్షాలు కురుస్తున్నాయని తెలియడంతో ప్రజలు తమ గ్రామాలకు బయలుదేరే సమయంలో 15 రోజులపాటు తినడానికి అవసరమైన భత్యం ఆయన అందజేశారు. రైతులకు పశువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు కూడా సమకూర్చారు.
ముఖ్యమంత్రి సీమ వాసి అయినా....
సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాయలసీమ వాసి అయినప్పటికీ ఈ ప్రాంతంలోని మహనీయుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టాలన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతృత్వం, త్యాగంలో ఎవరికీ తీసిపోని ఎంతోమంది రాయలసీమలో జన్మించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి గట్టిగా తీసుకు వెళ్లాలంటున్నారు.
‘సీమ’నేతల వైఖరే కారణం
డొక్కా సీతమ్మ పేరును వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కోస్తా నాయకులు ఎలాంటి వారైనా ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటై ప్రాంతీయ అభిమానాన్ని ప్రదర్శిస్తారు. బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సుద్దపల్లె లక్షుమ్మ, చిన్నదండ్లూరు శివమ్మ తదితర గొప్పవాళ్ల గురించి రాయలసీమ నేతలు ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ల గొప్పతనాన్ని తెలుసుకుంటే ప్రజలు తమను అసహ్యించుకుంటారనే భయమే ఇందుకు కారణం. ఈ ప్రాంత నాయకుల వైఖరి వల్లే రాయలసీమ వివక్షకు గురవుతోంది. – సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి,
అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి
ఇది ముమ్మాటికీ వివక్షే
కరువులో పేదలను ఆదుకోవడమే కాకుండా అనేక దానధర్మాలతో బుడ్డా వెంగళరెడ్డి మహాదాతగా గుర్తింపు పొందారు. స్వాతంత్య్ర భావనే లేని రోజుల్లో సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటీషర్లపై గొప్ప పోరాటం చేసి భావి జాతీయోద్యమానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎంతో ప్రేరణ ఇచ్చారు. ఏదైనా చారిత్రక స్థలానికి ఆయన పేరు పెట్టాలి. తొలి రాజకీయ ఖైదీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కల్లూరి సుబ్బారావు, పప్పూరి రామచార్యులు వంటిఎందరో మహానీయులకు రాయలసీమ జన్మనిచ్చింది. మొట్టమొదటి ఆధునిక కావ్యాన్ని రాసిన కట్టమంచి రామలింగారెడ్డి సీమ వాసి. ఆధునిక సాహిత్య విమర్శకు ఆయన ఆద్యుడు. రాష్ట్ర సాహిత్య అకాడమికి ఆయన పేరు పెట్టడం ఎంతో సముచితం. రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి, అక్కడి అభివృద్ధి తప్ప మరేది పట్టలేదు. కనీసం ప్రభుత్వ పథకాల్లో కూడా సీమ వాసుల పేర్లు పెట్టలేదంటే ఇది ముమ్మాటికీ వివక్షే. – ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి,
కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత
పథకాల పేర్ల మార్పులో రాయలసీమపై వివక్ష!
కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న మేధావులు
మిగతా పథకాలకై నా ‘సీమ’వాసులకు స్థానం కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment