ఉన్న ఉద్యోగాలు పీకేసే చంద్రబాబు. కొత్త ఉద్యోగాలు ఇస్తార
రైల్వేకోడూరు అర్బన్ : ఎన్నికలకు ముందు చంద్రబాబు , లోకేష్‌లు 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని.. నిరుద్యోగులందరికీ భృతి ఇస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ యువకులకు ద్రోహం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఏపీఎండీసీలో తొలగించబడిన ఉద్యోగులు గురువారం ఆయనను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కొరముట్ల మాట్లాడుతూ ఉన్న ఉద్యోగాలు తీసేసే సీఎం చంద్రబాబు కొత్త ఉద్యోగాలు ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే 2.25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ఎంతోమందికి ఉపాధి, ప్రజలకు సంక్షేమం అందించారని గుర్తు చేశారు. ఏపీఎండీసీలో స్థానికతకు ప్రాధాన్యం ఇస్తూ చదువుకొన్న 70 మంది యువతకు తాము ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబు రాగానే ఎటువంటి నోటీసులు లేకుండా నియంతృత్వ పోకడ, రాజకీయ కక్షతో వారిని తీసేయడం దారుణమని వ్యాఖ్యానించారు. అలాగే అన్ని డిపార్ట్‌మెంట్లలో చిరుద్యోగులను తీసేయడం సబబు కాదన్నారు. రాజకీయాలలో ఇది మంచి పరిణామం కాదని, అధికారంలో శాశ్వతంగా మీరే ఉండరని గుర్తుంచుకోవాలన్నారు. అధికారం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా చేస్తే ఉద్యోగులు, యువతలో అభద్రతా భావం ఏర్పడుతుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చామని గుర్తు పెట్టుకోవాలని కొరముట్ల అన్నారు. ఏపీఎండీసీలో తీసేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోకుంటే విజయవాడ, మంగంపేటలలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బరామరాజు, సీహెచ్ రమేష్, ఆర్వీ రమణ, జనార్దన్‌రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార
ప్రతినిధి కొరముట్ల
Comments
Please login to add a commentAdd a comment