సీఐపై ఫిర్యాదు చేసినందుకు వేధిస్తున్నాడు
రాయచోటి టౌన్ : రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు తనను కులం పేరుతో వేధిస్తున్నాడని రాయచోటి ఎంఆర్‌పీఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుంటిమడుగు ఆనంద్ ఆరోపించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు అనుమతులు లేకుండా చేస్తున్నారని, తన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేశారని విమర్శించారు. కొన్ని రోజుల క్రితం తన కులానికి చెందిన వారి సమస్యలను పరిష్కరించేందుకు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని, ఆయన ఎదుట కుర్చీలో కూర్చోగా.. ఆవేశంతో ఆగ్రహించి తనపై నానా దుర్బాషలాడి భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. అర్బన్ సీఐ చంద్ర శేఖర్ వివరణ కోరగా.. ఆనంద్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా సమాజాన్ని పక్కదోప పట్టిస్తున్నాడని, అందుకే ఐపీసీ 350 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తాను ఎప్పుడూ కులం పేరుతో ఎవరినీ దూషించలేదని, కావాలనే ఆయన ఆరోపణ చేస్తూ తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడన్నాడు. పోలీస్ శాఖలో ఉంటూ సమాజంలోని అన్ని వర్గాల వారిని సమానంగా చూస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment