ఒకే భూమికి ఎన్ని రిజిస్ట్రేషన్‌లు చేస్తారు.?
మదనపల్లె : పాతికేళ్ల క్రితం ప్లాట్ల రూపంలో కొనుగోలు చేసిన భూమిని, తిరిగి వ్యవసాయభూమి కింద వేరొకరికి ఎలా రిజిస్ట్రేషన్ చేశారని, చేసేటప్పుడు కనీసం రికార్డులు కూడా పరిశీలించరా..? ఒక భూమికి ఎన్ని రిజిస్ట్రేషన్‌లైనా చేసేస్తారా? అంటూ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, సబ్ రిజిస్ట్రార్ గురుస్వామిని నిలదీశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్.. తమ ఇంటి స్థలాలు కబ్జా చేశారని చేనేత కార్మికులు శనివారం ఎమ్మెల్యే షాజహాన్‌బాషాను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల క్రితం తాము కొనుగోలుచేసిన డాక్యుమెంట్లు, బ్యాంకు తాకట్టుపత్రాలు, నిర్మాణం జరిపిన ఇళ్ల ఫొటోలు ఆయనకు చూపించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, తాము ప్లాట్ల రూపంలో కొనుగోలు చేసిన భూమిని, వ్యవసాయభూమిగా పేర్కొంటూ జీపీ ద్వారా జనవరి 2025లో తనపేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. ప్రస్తుతం ఆ డాక్యుమెంట్లు పట్టుకుని తమ స్థలాల్లోకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడన్నారు. తమ ఇళ్లచుట్టూ జేసీబీతో గుంతలు తవ్వి కంచె వేస్తూ, ఎవ్వరినీ లోనికి రానివ్వకుండా బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగని పక్షంలో యువ నాయకుడు నారా లోకేష్‌ను కలిసి, మాజీ ఎమ్మెల్యే అక్రమాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్‌బాషా మాట్లాడుతూ.. సబ్ రిజిస్ట్రార్ గురుమూర్తితో.. బండమీద కమ్మపల్లె రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్.423–1, 423–2లో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేరుతో జరిగిన రిజిస్ట్రేషన్లు బ్లాక్‌లో పెట్టాల్సిందిగా ఆదేశించారు. గతంలో ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్న వారు మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ ఉంటే ఇళ్ల నిర్మాణాలు చేసుకోండని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన వారిలో బాధితులు నళిని, మాలిన్, మంజుల, వెంకటయ్య, ఆర్.శంకర్, చంద్రశేఖర్, రమణ, స్వాతి, సుబ్రహ్మణ్యం ఉన్నారు.
సబ్ రిజిస్ట్రార్‌ను నిలదీసిన ఎమ్మెల్యే షాజహాన్‌బాషా
టీడీపీ మాజీ ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్‌ను బ్లాక్ చేయమని ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment