నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 24వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని తెలిపారు.
నేడు వైవీయూ నూతన
వీసీ బాధ్యతల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు సోమవారం ఉదయం 10 గంటలకు వీసీ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ గా ఉన్న ఫణితి ప్రకాష్ బాబును వైవీయూ వీసీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఈ నెల 18వ తేదీన జి ఓ ఎం ఎస్ నెంబర్ 6 ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఏర్పాట్లు పూర్తి చేసింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రిన్సిపాల్స్, డీన్‌లు, వివిధ విభాగాల డైరెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బందితో విడివిడిగా సమావేశం కానున్నారు.
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
రాయచోటి: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కృష్ణయ్య సూచించారు. ఆదివారం రాయచోటిలో పరీక్ష కేంద్రాల్లో నియమించిన చీఫ్ సూపరిటెండెంట్స్, డిపార్టుమెంటల్ ఆఫీసర్స్, కస్టోడియన్స్‌కు ఓరియంటేషన్, ట్రైనింగ్ సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలు 49 కేంద్రాల్లో జరుగుతాయన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ పరీక్షల్లో మొదటి సంవత్సరం 14855 మంది, ద్వితీయ సంవత్సరం 13747 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్స్ ప్రకాష్, అమరేంద్ర కుమార్, నాగ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
గంగమ్మ జాతరకు
ముమ్మరంగా ఏర్పాట్లు
లక్కిరెడ్డిపల్లి: శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ జాతర మార్చి 1, 2 తేదీల్లో జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాకార మండపంతోపాటు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు గంగమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ వెంకట కొండారెడ్డి, ఎస్‌ఐ రవీంద్రబాబు జాతర ఏర్పాట్లను సామాన్య భక్తులకు అమ్మవారి దర్శ నం కలిగేలా క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. అమ్మవారికి చాందినీ బండ్లు కట్టేవారు పోలీసుల అనుమతులు తీసుకొని పరిమిత ఎత్తు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది భక్తులకు రూ. 300లు, రూ. 100లు, రూ.10 టికెట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఆల య ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, పూజారులు చెల్లు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Comments
Please login to add a commentAdd a comment