ఆదేశాలు బేఖాతర్..ఆగని ఎమ్మెల్యే భూ కబ్జా
సాక్షి టాస్క్ ఫోర్స్: వక్ఫ్ బోర్డ్ పేరుతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ ప్రైవేట్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాషా భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణానికి చెందిన బాషిత్ బాషా, షరీఫ్,వెంకటరమణ నాయుడు, శంకర్ రెడ్డి తదితరులు 30 మందికి పైగా ఆది వారం టిప్పు సుల్తాన్ మైదానం వద్దకు చేరుకున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఎమ్మెల్యే అక్రమంగా కొనసాగిస్తున్న నిర్మాణాలను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడు మీడియాకు విన్నవించారు. ఈనెల 19న సబ్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించేందుకు మదనపల్లెకు వచ్చిన ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియాకు ఎమ్మెల్యే భూ కబ్జా, వక్ఫ్ బోర్డు పేరుతో చేస్తున్న అక్రమ వసూళ్లు, టిప్పు సుల్తాన్ మైదానం వద్ద షాప్ రూ ములు నిర్మించి ఇస్తామని సేకరించిన డిపాజిట్లపై ఫిర్యాదు చేశామన్నారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసినా, ఎమ్మెల్యే వాటిని బేఖాతర్ చేస్తూ తమ ప్రైవేట్ భూముల్లో నిర్మాణాలు కొనసాగిస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కరి వద్ద లక్షల్లో డిపాజిట్లు సేకరిస్తున్నారన్నారు.ఖాజీ ఫ్యామిలీ మైసూర్ పాలకులైన టిప్పు సుల్తాన్ వద్ద నుంచి 20 ఇవాన్లకు భూములు కొన్నారన్నారు. 1862లో బ్రిటిష్ ఇనాం కమిషనర్ వద్ద నుంచి ఎన్ ఫ్రాంచైజెస్ ఇనాం యాక్ట్ ద్వారా హక్కులు పొందారన్నారు.అయితే ఆ భూము లను వక్ఫ్ బోర్డ్ నోటిఫై చేసిందని , ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా షాపు రూములు నిర్మించి మసీదు పేరుతో, దొంగ రసీదులు ఇచ్చి బాడుగలు వసూలు చేసుకుంటున్నారన్నారు. బాధితుడు బాషిత్‌బాషాకు సర్వే నంబర్ 173 లో 97 సెంట్లు భూమికి సంబంధించి తమ వారసులు 1926లో పట్టా పొందారన్నారు. 2008లో షాజహాన్ బాషా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తన స్థలంపై కన్ను పడిందన్నారు. వక్ఫ్ బోర్డ్ పేరుతో రూ. 1.20 కోట్లు వసూలు చేసి షాపు రూములు నిర్మించారన్నారు. దీనిపై సీసీఎల్‌ఏ, సింగిల్ బెంచ్, డివిజన్ బెంజ్, వక్ఫ్‌బోర్డ్ ట్రిబ్యునల్లో తనకు అనుకూలంగా నిర్ణయాలు వెలుపడ్డాయన్నారు. అదేవిధంగా సర్వేనంబర్ 171 లో 4.65 ఎకరాల భూమికి సంబంధించి సబ్ డివిజన్ పూర్తికాగా, అందులో ఒక ఎకరా స్థలాన్ని ఆక్రమించి అనధికారంగా నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారుల నోటీసు బేఖాతార్ చేస్తూ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారన్నారు. అధికారులు మున్సిపల్ యాక్ట్ ప్రకారం నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. సర్వేనంబర్ 173 ను మున్సిపల్ లెక్కల్లో లేకుండా చేశారన్నారు.
ఇబ్బందులకు గురి చేస్తున్నారు
ఎమ్మెల్యే 20 ఏళ్లుగా వక్ఫ్ బోర్డ్ ,మసీదుల పేరుతో అక్రమంగా బాడుగలు వసూలు చేస్తూ దందాలకు పాల్పడ్డారన్నారు. రూ 20 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా టీడీపీ కార్యకర్తలైన తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వక్ఫ్ బోర్డ్ పేరుతో వసూలు చేసిన నిధులు ఎక్కడ ఉపయోగించారని, పేదలు ఒకరికై నా సాయం చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మసీదు పేరుతో ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అక్రమ దందాపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.
వక్ఫ్‌బోర్డ్ పేరుతో 20 ఏళ్లుగా అనధికార వసూళ్లు
టిప్పు సుల్తాన్ మైదానం వద్ద నిర్మాణాలను అడ్డుకొని బాధితుల నిరసన
ఆదేశాలు బేఖాతర్..ఆగని ఎమ్మెల్యే భూ కబ్జా
Comments
Please login to add a commentAdd a comment