రైతు సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం
రాయచోటి: రైతు సంక్షేమం గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న ద్రోహంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవా అంటూ ఊదర గొట్టిన కూటమి నేతలు ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో కన్నా పెట్టుబడి సాయం ఏటా రూ. 20 వేలు ఎందుకివ్వలేదని నిలదీశారు. ఇప్పటికే కేంద్రం పీఎం కిసాన్ సాయం రెండు విడతల్లో రైతులకు అందించిన కేంద్ర ప్రభుత్వం చివరి విడతగా ఈనెల 24న మరో రూ. 2 వేలను ఖాతాలకు జమ చేయనుందన్నారు. అయినా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక విడత కూడా నిధులు విడుదల చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నాడు వైఎస్ జగన్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకుంటే నేడు చంద్రబాబు ఉచిత పంటల బీమాను ఎత్తివేసి ఎకరాకు రూ. 615 చొప్పున ప్రీమియాన్ని అన్నదాతలపై భారం మోపారని ఆయన దుయపట్టారు. వేరుశనగ పంట దెబ్బతిన్నా ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 1.45 లక్షల కోట్లు అప్పులు చేసినా రైతులకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టమాటా రైతులను ఆదుకోవాలి
టమాటా రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందన్నారు. కిలో టమాటా ధరలు రూ. 4, రూ. 5లకు పడిపోవడంతో కనీసం పంట కోసిన కూలీలకు, రవాణా చార్జీలు కూడా రాక రైతులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం చొరవ చూపి తోటల వద్దే టమాటా కొనుగోలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో కిలో ఉలవలు రూ. 70 ఉండగా నేడు రూ.30 కూడా పలకకపోవడంతో రైతులు నష్టాలు మూటకట్టుకుంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment