టీడీపీ మాజీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి
మదనపల్లె : టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, అక్రమ రిజిస్ట్రేషన్‌తో ఆయన స్వాధీనం చేసుకున్న తమ ఇళ్ల స్థలాలను తమకు అప్పగించాలని కోరుతూ చేనేత కార్మికులు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌ను వేడుకున్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను తీసుకుని, వారి సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బండమీదకమ్మపల్లె రెవెన్యూ గ్రామం నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత కార్మికులు తమ కష్టార్జితాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశారు. సిరికల్చర్ కాలనీ ఏరియా సర్వేనెంబర్.423–2లో వేసిన లేఅవుట్‌లో 77మంది చేనేత కార్మికులు... 21 ఏళ్ల క్రితం కొండుపల్లె యశోదమ్మ, శ్రీనివాసులు, రెడ్డెప్పల నుంచి ఇళ్లస్థలాలను కొనుగోలు చేశామన్నారు. అందులో కొందరు ఇల్లు నిర్మించుకోగా, మరికొందరు పునాదులు వేసుకుని భద్రపరుచుకున్నామన్నారు. ఈ స్థలాలపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్..2020లో దేశిరెడ్డి హరినాథరెడ్డి పేరుపై జీపీఏ చేయించి, సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్‌తో చేతులు కలిపి, తమ పేర్లపై రిజిస్ట్రేషన్ జరిగిన ఇళ్లస్థలాలను వ్యవసాయ భూములుగా పేర్కొంటూ తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. తర్వాత అక్రమంగా తమ స్థలాల్లోకి ప్రవేశించి, ఇళ్ల స్థలాల హద్దులను చెరిపివేసి, అడ్డువచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ భూమిని కబ్జా చేశారన్నారు. దీనిపై తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్‌లను కలిసి వేడుకుంటే వారు పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషాను కలిసి వినతిచేస్తే..ఆయన మాజీ ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్‌ను రద్దుచేయమని ఆదేశించినా, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌లు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ నుంచి తమకు బెదిరింపులు ఎక్కువయ్యాయని, తమకు ఏదైనా జరిగితే దానికి ఆయనదే పూర్తిబాధ్యత అన్నారు.
సబ్ కలెక్టర్‌ను వేడుకున్న బాధితులు
Comments
Please login to add a commentAdd a comment