నిర్ణీత సమయంలోగా సమస్యలు పరిష్కరించాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
నడవలేని స్థితిలో వచ్చిన ఫిర్యాదు దారులతో..
మదనపల్లె మండలం, కోళ్లబైలు గ్రామం నుంచి వచ్చిన ఎ.సలావుద్దీన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో స్ట్రక్చర్ పై ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తాను టీవీఎస్ వాహనంలో వెళ్తుండగా ఎదురుగా బైక్‌పై వస్తున్న వ్యక్తి ఢీ కొట్టగా తీవ్రగాయాలయ్యాయని, తనకు నష్టపరిహారం, ఆసుపత్రి ఖర్చులు ఇప్పించేలా సహాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. దీంతో అతని సమస్యను పరిష్కరించాలని మదనపల్లె ఒకటో పట్టణ సీఐకి ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు. అలాగే నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి నుంచి వచ్చిన ఎస్.హుస్సేన్ బాషా నడవలేని స్థితిలో కుటుంబ సభ్యుల సాయంతో వచ్చారు. కాలు విరిగి వైద్యం కోసం దాచుకున్న నగదును పరిచయస్తుడైన వ్యక్తి తీసుకొని ఇవ్వలేదని, డబ్బులు ఇప్పించేలా న్యాయం చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించాలని నందలూరు ఎస్‌ఐను ఎస్పీ ఆదేశించారు.
మజ్జిగ పంపిణీ..
ఎండలు ప్రారంభం కావడంతో కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారులకు ఇబ్బందులు కలగకుండా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మజ్జిగ పంపిణీ చేశారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment