ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
మదనపల్లె : సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్ సొసైటీ) ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగింది. సోమవారం ఓపెన్ ఇంటర్ పరీక్షలు పట్టణంలోని జెడ్పీ ఉన్నతపాఠశాల, కోటబడి హోప్ మున్సిపల్ హైస్కూల్, రామారావుకాలనీ బాపూజీ మున్సిపల్ హైస్కూల్ కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సుమారు 550 మందికి పైగా విద్యార్థులు మూడు కేంద్రాల్లోనూ పరీక్షలకు హాజరయ్యారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో లైవ్ స్ట్రీమింగ్‌లో పర్యవేక్షణ జరుగుతోంది. అయితే ఓపెన్ ఇంటర్ పరీక్షలు మాత్రం ఇందుకు భిన్నంగా, ఎలాంటి బందోబస్తు లేకుండా ఇన్విజిలేటర్లు స్వయంగా విద్యార్థుల చేతికి స్లిప్పులు అందించి కాపీయింగ్‌కు సహకరించారు. సాధారణంగా పలు కారణాలతో కళాశాలలు, పాఠశాలకు వెళ్లని అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరవుతుంటారు. ఇంకా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగోన్నతి కోసం ఓపెన్ ఇంటర్ స్కూల్ పరీక్షలు రాస్తున్నారు. ఇదే అదనుగా భావించిన స్టడీ కేంద్రాల నిర్వాహకులు అభ్యర్థులు ఒకొక్కరి నుంచి రూ.10 నుంచి 12 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ మొత్తంలో విద్యాశాఖాధికారులకు, ఇన్విజిలేటర్లకు వాటాలు ముట్టజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ముగిశాక, పరీక్షా కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా విద్యార్థులు పడేసిన స్లిప్పులు కనిపించాయి. ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌పై ఎంఈఓ–2 రాజగోపాల్‌ను వివరణ కోరితే... పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామన్నారు. మాస్ కాపీయింగ్‌కు అవకాశమే లేదని, పరీక్ష నిర్వహణ పారదర్శకంగా నిర్వహించామన్నారు. స్టడీ సెంటర్ల నిర్వాహకుల డబ్బు వసూళ్లు తమ దృష్టికి రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment