
ఎంపీలతో ఎమ్మెల్యే భేటీ
రాజంపేట రూరల్ : తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిలతో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి భేటీ అయ్యారు. స్థానిక మేడా భవన్‌కు వచ్చిన ఎంపీలతో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆకేపాటి సోమవారం వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. పలు విషయాలపై చర్చించారు. ఎంపీలను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు విజయ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు ఎస్. నవీన్‌కుమార్, డొంక సూరి, డొంక సురేష్, కూండ్ల రమణారెడ్డి, ఎస్.న్యామతుల్లా, విష్ణు నాయక్, సుబ్రమణ్యం పాల్గొన్నారు.
కక్షగట్టి నిప్పు పెట్టారు
సంబేపల్లె : వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆవుల కుటుంబ సంబంధీకుల భూములపై గత కొంత కాలంగా కక్ష సాగింపు సాగుతోంది. ఈ క్రమంలో మండల పరిధిలోని మొటుకువాండ్లపల్లె క్రాస్ సమీపంలో ఉన్న తోటకు సోమవారం గుర్తు తెలియని దుండుగలు నిప్పు పెట్టారు. మంటలు అధికం కావడడంతో పైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. స్పందించిన ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే పొలంలో ఉన్న పైపులు, డ్రిప్ వైర్లు, కాలి బూడిదగా మారాయి. ఆవుల కుటుంబంపై ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష అని పలువురు చర్చించుకుంటున్నారు.
అక్రమంగా మట్టి తరలింపు
సిద్దవటం : ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు పనులు చేపట్టిన ప్రాంతాల నుంచి ట్రాక్టర్‌ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. సిద్దవటం మండలంలోని టక్కోలు ఎర్ర చెరువులో గత రెండు వారాల నుంచి 60 మంది ఉపాధి హామీ కూలీలు ఫిష్ పాండ్ పనులు చేస్తున్నారు. పనులు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లే సమయంలో ఉపాధి పనులు చేపట్టిన ప్రాంతాల నుంచి అక్రమంగా కొంతమంది మట్టిని ఇటుకల బట్టీలకు తరలించుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ మట్టి విలువ దాదాపు రూ. 5వేలకు విక్రయించుకుంటున్నారు. ఉపాధి కూలీలు పనులు చేసిన ప్రదేశాల్లో అధికారులు కొలతలు తీసుకోక ముందే మట్టిని తరలిస్తుండటంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉపాఽధి హామీ ఏపీఓ నరసింహులు వివరణ కోరగా మట్టి తరలి పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
కూలిన విద్యుత్ స్తంభం
లక్కిరెడ్డిపల్లి: గంగమ్మ జాతరకు వెళ్తూ చాందినీ బండి ముందున్న డీజే వాహనం విద్యుత్ స్తంభానికి తగలడంతో ఒక్కసారిగా విరిగి పడిపోయింది. వందలాది మంది రద్దీగా ఉన్న చౌటపల్లి కొత్తపల్లిరోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కుర్నూతల వడ్డిపల్లికి చెందిన వ్యక్తి తలకు బలమైన గాయం తగలడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ట్రాన్స్‌కో అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంపీలతో ఎమ్మెల్యే భేటీ
Comments
Please login to add a commentAdd a comment