సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
రాయచోటి : ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పిజిఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 228 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రతి సమస్యపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందని కలెక్టర్ అన్నారు. కాబట్టి అధికారులందరూ ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వచ్చిన అర్జీదారులకు జిల్లా కలెక్టర్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, టీ సౌకర్యాలను కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్‌ఓ మధుసూదన్ రావు, ఎస్‌డీసీ రమాదేవి పాల్గొన్నారు.
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రాధాన్యత
విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో డిగ్రీ ఆపై తరగతులు చదువుతున్న ఆరుగురు విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ చేతులు మీదుగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేశారు. జాతీయ దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి పథకం ద్వారా టెంట్ హౌస్ వ్యాపారంతో స్వయం ఉపాధి పొందేందుకు షేక్ జిలానీకి రూ. 5 లక్షలు రుణం చెక్కును అందజేశారు.
గోడపత్రాల ఆవిష్కరణ
రాయచోటి జగదాంబసెంటర్ : ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ‘పిల్లల చెవి ఇన్ఫెక్షన్‌ను ఎలా నయం చేసుకోవచ్చు’ అనే విషయంపై గోడపత్రికను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వినికిడి దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. పిల్లలలో వచ్చే చెవి ఇన్ఫెక్షన్‌ను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని, ఈఎన్‌టీ వైద్యుడిని మాత్రమే సంప్రదించాలని సూచించారు. సొంత వైద్యం చేయరాదని, ఆకుపసరు లేదా నాటువైద్యుల సలహాలు పాటించరాదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment