ప్రదక్షిణలు.. పడిగాపులు
● జిల్లాలో రైతులకు అందని
గుర్తింపు కార్డులు
● ఆన్‌లైన్‌లో కనిపించని
41 గ్రామాల భూముల వివరాలు
● అన్నదాతకు తప్పని ఎదురుచూపులు
గుర్రంకొండ : రైతులకు రైతు గుర్తింపు కార్డులు అందని ద్రాక్షపండులా మిగిలాయి. ఆయా గ్రామాలకు చెందిన రైతులు రోజుల తరబడి రైతుసేవాకేంద్రం వద్ద పడిగాపులు కాస్తూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇందు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో 41 రెవెన్యూ గ్రామాల్లో వేలాది మందికి చెందిన వేల ఎకరాల భూముల జాడే లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ గడువుతేదీ పొడిగించినా కార్డులు అందని వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో రైతు గుర్తింపు కార్డులు నమోదు ప్రక్రియ వేగంగా నిర్వహించారు. రైతుసేవాకేంద్రంలో వ్యవసాయశాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో ఆయా గ్రామాలకు చెందిన రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. భూమి పాసుపుస్తకం, రైతు ఆధార్‌కార్డు నంబరు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత రైతు సెల్‌ఫోన్‌కు రెండు సార్లు ఓటీపీలు వస్తున్నాయి. చివరగా వెబ్‌సైట్‌లో ల్యాండ్ మార్కింగ్ దగ్గరకి వెళితే మాత్రం ఆయా గ్రామాలకు సంబంధించిన భూముల వివరాలు, సర్వేనంబర్లు చూపించడంలేదు. ప్రతిరోజు ఎన్ని మార్లు ప్రయత్నించినా చివరకు ఇదే ఫలితం వస్తోందని సిబ్బంది, రైతులు ఆరోపిస్తున్నారు. అలాగే ప్రభుత్వ భూములు సాగు చేసుకొంటున్న వారికి, డీకేటీ పట్టాలు పొందిన పలువురికి కుడా గుర్తింపు కార్డులు అందడం లేదని అన్నదాతలు అంటున్నారు.
భూముల వివరాలు ఆన్‌లైన్‌లో లేని గ్రామాలు:
నందలూరులో ఒకటి, రామాపురంలో రెండు, రాజంపేటలో ఒకటి, పెనగలూరులో ఆరు, చిట్వేల్‌లో ఆరు, ములకలచెరువులో నాలుగు, బి.కొత్తకోటలో రెండు, లక్కిరెడ్డిపల్లెలో ఆరు, కేవీ పల్లెలో రెండు, నిమ్మనపల్లె, గుర్రంకొండ, కలకడ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, సంబేపల్లెలో ఒకటి, తంబళ్లపళ్లె మూడు, వీరబల్లె ఒకటి, పీటీఎం మూడు గ్రామాలు మొత్తం జిల్లా వ్యాప్తంగా 41 గ్రామాల్లో రైతుల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో గుర్తింపు కార్డుల జారీప్రక్రియ ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
గడువు పొడిగించినా..
రైతు గుర్తింపు కార్డు నమోదు జారీ ప్రక్రియ గడువు ఈ నెల 25 వరకు పొడిగించినా రైతుల్లో ఆందోళన తగ్గడం లేదు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం గత నెల 28 గడు వు తేదీగా నిర్ణయించింది. అయినా గడువు తేదీలోగా 41 గ్రామాల రైతుల సమస్య పరిష్కారం కాలేదు. నిర్ణీ త గడువు పొడిగించినా ఆన్‌లైన్‌లో భూముల వివరాలు కనపించడంలేదని, తమ పరిస్థితి ఏమిటని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అలాగే జిల్లాలో ప్రభుత్వభూములు సాగు చేసుకొంటున్న వారు, డీకేటీ పట్టాలు పొందిన వారికి కూడా రైతు గుర్తింపుకార్డులు జారీ కాలేదు. ఉన్నతాధికారులు స్పందించి కార్డులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో మొత్తం రైతులు : 3,44,873
పీఎం కిసాన్ అర్హులైన వారు : 1,78,197
గుర్తింపు కార్డులు పొందని గ్రామాలు : 41
ఇప్పటివరకు గుర్తింపు కార్డులు
అందని రైతులు : 62,598
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
జిల్లాలోని పలు రెవెన్యూ గ్రామాల్లో రైతులకు రైతు గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియ జరగడం లేదనే విషయం రాష్ట్రవ్యవసాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గత కొన్నిరోజులుగా ఈసమస్య ఉంది. రైతు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ గడువు ఈనెల 25 వరకు పొడించారు. అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. – చంద్రానాయక్,
జిల్లా వ్యవసాయాధికారి, అన్నమయ్య జిల్లా
Comments
Please login to add a commentAdd a comment