చంపుతామని బెదిరించడంతో... గుండెపోటుతో వైఎస్సార్‌సీపీ కా
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పెనగలూరు మండలం, కొండూరు పంచాయతీ, తిరణంపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త బయనబోయిన పెంచలయ్య (65) ప్రాణ భయంతో గుండె ఆగి మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా.. తిరుణంపల్లి గ్రామ సర్వే నెంబరు 5లో 2.76 ఎకరాలు పెంచలయ్య పేరుతో రెండేళ్ల క్రితం ఆన్‌లైన్ అయింది. అనంతరం ఆ సర్వే నెంబర్‌ను తన భార్య పేరుతో రిజిస్టర్ చేయించాడు. తిరుణంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బయనబోయిన బుజ్జి అలియాస్ మణి, వెంకటేష్‌లు ఈ భూమి తమదంటూ రెండేళ్ల నుంచి పెంచలయ్య కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. మంగళవారం మృతుడు తన భూమిలో ఎండిపోయిన వేపచెట్టును కొట్టేందుకు ఉదయం 7 గంటలకు కూలీలను తీసుకెళ్లాడు. చెట్టును కొడుతున్న సమయంలో మణి, మరికొంత మంది అక్కడికి వచ్చి ఈ చెట్టును ఎందుకు కొడుతున్నావంటూ తీవ్రంగా దుర్భాషలాడారు. భూమిని రిజిస్టర్ చేయించుకున్నావు. నిన్ను కచ్చితంగా చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పెంచలయ్య అదే భయంతో ఇంటికి వెళ్లాడు. ఉదయం 9 గంటల సమయంలో గుండెనొప్పి రావడంతో వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందాడు. చంపుతామని బెదిరించడంతోనే భయపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని పెనగలూరు పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చారు. రాజంపేట రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ రవిప్రకాష్ రెడ్డిలు మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా చివరి క్షణంలో మృతుని కుటుంబ సభ్యులు గుండెపోటుతో మృతి చెందాడని స్టేట్‌మెంట్ రాసి కేసు వద్దని వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment