భూ వివాదంలో రైతుపై దాడి
గాలివీడు : మండల పరిధిలోని గోరాన్ చెరువు గ్రామం బండివాండ్లపల్లె భూ వివాదంలో మంగళవారం రైతుపై దాడి ఘటన చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు మిట్టపల్లి కాటం రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. కాగా, వీరికి 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దాదాపు ముప్ఫై సంవత్సరాల క్రితం మొత్తం భూమిని అన్నదమ్ములు సమ భాగాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మిట్టపల్లి విశ్వనాథ రెడ్డి సర్వే నంబర్ 2024లో తనకు కేటాయించిన భూమిలో దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం మామిడి మొక్కలు పెంచుకున్నాడు. భూ భాగాల విషయమై తరచూ అన్నదమ్ములు ఘర్షణ పడేవారు. ఇదే విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులకు పలుమార్లు విశ్వనాథరెడ్డి తెలియజేస్తూ, భూ భాగాల ఒప్పంద పత్రాలు ఉన్నప్పటికీ అన్నదమ్ములు దానిని తిరస్కరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తనకు కేటాయించిన భాగంలో మామిడి మొక్కలు పెంచుకున్నానని, తిరిగి అందులో మరోమారు భాగాలు పంచాలంటున్నారని తెలిపాడు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలసి వినతిపత్రం ఇచ్చానన్నారు. అయితే మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు మామిడి తోటకు వెళ్లే దారిలో మాటువేసి తనపై ముసుగు వేసి దాడి చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. కుటుంబ సభ్యుల సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరానని తెలిపాడు. అధికారులు విచారణ జరిపి తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తన భూమిని తనకు ఇప్పించాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment