బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌కు వచ్చే సందర్శకుల నుంచి వసూలు చేసే టోల్ రుసుంపై వేలం పాటలు నిర్వహించి ప్రయివేటుకు అప్పగిస్తారా లేక రెవెన్యూ సిబ్బందితో వసూళ్లు కొనసాగిస్తారా అన్నది స్పష్టం కావడం లేదు. గతేడాది సెప్టెంబర్ 30న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో వేలంపాటలు నిర్వహించగా.. మదనపల్లెకు చెందిన వ్యక్తి రూ.45.20 లక్షలతో రికార్డు స్థాయిలో లీజు దక్కించుకున్నాడు. అక్టోబర్ 18 నుంచి ఏడాది పాటు టోల్ వసూలుకు అప్పగించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 4 వరకు వేలంలో పాడిన సొమ్మును చెల్లించకపోవడంతో ఐదో తేదీన టెండర్ రద్దు చేసి.. 5వ తేదీ నుంచి రెవెన్యూ సిబ్బందితో వసూళ్లు చేయిస్తున్నారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో లీజులు, గుత్తలపై మార్చిలో వేలం పాటలను నిర్వహించి ప్రయివేటుకు అప్పగిస్తారు. అయితే హార్సిలీహిల్స్ టౌన్‌షిప్ కమిటీ చైర్మన్ అయిన మదనపల్లె సబ్‌కలెక్టర్ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. దీనితో వేలంపాటలు నిర్వహిస్తే పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న పాటదారులు ఎదురు చూస్తున్నారు. గత వేలంలో అత్యధికంగా రూ.45.20 లక్షలకు పాడారు. ఈ పాటను దృష్టిలో పెట్టుకుని అధికారులు తదుపరి వేలంపాటపై నిర్ణయం తీసుకుంటారా.. లేక గత పాటలో నిర్ణయించిన ధర పాటను మొదలు పెడ్తారా అన్నది తేలాలి. కాగా ఫిబ్రవరి 5 నుంచి బి.కొత్తకోట రెవెన్యూ సిబ్బంది టోల్ వసూళ్లు చేస్తున్నారు. రోజుకు మూడు షిఫ్టుల్లో వీఆర్‌ఏలను నియమించి చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తింపజేస్తున్నారు. వాహనాలకు టోకెన్లు ఇస్తూ ఎంట్రీ ఫీజును వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేస్తుండటంపై ఎలాంటి ఆరోపణలు, విమర్శలు లేకపోవడంతో.. ఇదే పద్ధతితో కొనసాగిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐదేళ్ల క్రితం వరకు రెవెన్యూ సిబ్బంది ద్వారానే టోల్ వసూలు చేయించేవాళ్లు. తర్వాత ఇద్దరు వీఆర్‌ఏలు అవినీతికి పాల్పడటంతో వారిని సస్పెండ్ చేశారు. దీనితో సబ్‌కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. దీనిపై తహసీల్దార్ అజారుద్దీన్ మాట్లాడుతూ వేలం పాటలపై తమకు ఎలాంటి సమాచారం లేదని శుక్రవారం చెప్పారు.
హార్సిలీహిల్స్ టోల్‌గేట్ వసూళ్లపై సందిగ్ధం
ఫిబ్రవరి 5 నుంచి రెవెన్యూ సిబ్బందితో వసూళ్లు