రామాపురం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం నీలకంట్రావుపేట గ్రామం శివాలయం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఎస్‌ఐ వెంకటసుధాకర్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గాలివీడు మండలం నూలివీడుకు చెందిన ఆవుల ఎర్రగంరెడ్డి, బాలిక కడపలో చదువుకుంటూ సెలవుల కారణంగా ఇరువురు ద్విచక్రవాహనంలో ఇంటికి బయలుదేరారు. మార్గంమధ్యలో శివాలయం వద్దకు రాగానే ముందు వైపున కడప నుంచి రాయచోటి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికుల కోసం నిలుపుటకు ప్రయత్నించింది. బస్సు వెనుక వైపున వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆవుల ఎర్రగంరెడ్డి, బాలిక కింద పడి గాయాల పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
రాయచోటి టౌన్ : వాయల్పాడు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ పీలేరులో కాపురం ఉంటూ ఇంటికి వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ కుటుంబసభ్యులను పరామర్శించి దహన సంస్కారాల కోసం లక్ష రూపాయల నగదును పోలీసు అధికారులు ఆదినారాయణ భార్య శివకుమారికి అందజేశారు. ఆదినారాయణ మృతి పట్ల వాయల్పాడు ఎస్‌ఐ చంద్రశేఖర్, సహోద్యోగులు విచారం వ్యక్తం చేసి చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం మంగళంపేట బలిజపల్లిలో వారి స్వగృహంలో ఆదినారాయణ మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గువ్వలచెరువులో ఇఫ్తార్ విందు
రామాపురం : మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని, ఈ మాసంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాపురం మండలం గువ్వలచెరువులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిచడమే రంజాన్ ఉపవాసాల ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో గువ్వలచెరువు ముస్లిం పెద్దలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేట పంచాయతీ, తూర్పుపల్లికి చెందిన సుంకేశుల శ్రీనివాసులు (44) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులబాధ భరించలేక శనివారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు, మిత్రులు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం లేదని, విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ నవీన్ బాబు తెలిపారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

గువ్వలచెరువులో ఇఫ్తార్ విందు