ట్రిపుల్ ఐటీ ఏఓ రవి కుమార్
కమలాపురం : ప్రతి విద్యార్థి గురువులు చెప్పే పాఠాలు విని అవగాహన చేసుకుని మంచి ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ట్రిపుల్ ఐటీ ఆర్‌కే వ్యాలీ ఇడుపులపాయ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రవి కుమార్ తెలిపారు. ఆదివారం మండలంలోని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్)లోని డీఏవీ భారతి విద్యా మందిర్ 6వ వార్షికోత్సవ వేడుకలను బీసీసీపీఎల్ సీఎంఓ సాయి రమేష్ పర్యవేక్షణలో ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రిపుల్ ఐటీ ఏఓ మాట్లాడుతూ విద్యార్థులు ముఖ్యంగా ఏరోజు చెప్పిన పాఠాలను అదే రోజు చదివి అవగాహన చేసుకుని అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాని సాధనకు కృషి చేయాలన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు.
వేంపల్లె ఎంఈఓ జాఫర్ సాదిక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ శ్రద్ధగా విని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, అప్పుడే తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామాలకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా, ఇష్టపడి చదవాలన్నారు. కోర్ అడ్వైజరీ సుబ్బులక్ష్మీ సాయి రమేష్ మాట్లాడారు.