
వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించాలి
రాయచోటి టౌన్: వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించాలని, అందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తోందని అన్నమయ్యజిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రనాయక్ అన్నారు. మంగళవారం రాయచోటి వ్యవసాయశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో రాయచోటి డివిజన్ పరిధిలోని సుండుపల్లె, సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి మండలాలకు చెందిన వ్యవసాయశాఖ అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని యాంత్రీకరణ చేసే క్రమంలో రైతుల భాగస్వామ్యంతో మందుల పిచికారి యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి రూ.9లక్షల చొప్పున నాలుగు మండలాలకు రూ.36లక్షలతో యంత్రాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ యంత్రాలను సబ్సిడీతో అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎంపిక చేసుకొనే యంత్రాల పద్ధతి (ధరల) ప్రకారం సబ్సిడీ వర్తిస్తుందని చెప్పారు. పీఎం కిసాన్ లబ్ధికోసం రైతులు ఇప్పటి వరకు 80 శాతం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఇంకా 20 శాతం మంది రైతులు చేసుకోలేదని, వారి కోసం ఈ నెల 8వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అలాగే కందులకు మద్దతు ధర కల్పించినట్లు ఆయన తెలిపారు. క్వింటా ధర రూ.7550లతో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోందని తెలిపారు. దీని కోసం రైతులు రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవాలన్నారు.