
కారు సహా రూ. 12 లక్షల ఎర్రచందనం స్వాధీనం
పీలేరు : కారుతో సహా రూ. 12 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎఫ్‌ఓ గురుప్రభాకర్ తెలిపారు. శేషాచలం అడవుల నుంచి తమిళనాడుకు అక్రమంగా ఎర్రచందనం రవాణా జరుగుతున్నట్లు అందిన సమాచారంతో సోమల మండలం కందూరు వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం కలికిరి వైపు నుంచి కందూరు వైపు అతివేగంగా వెళుతున్న కారును సిబ్బంది ఆపే ప్రయత్నం చేయగా వేగంగా ముందుకు వెళ్లిన కారును ఫారెస్ట్ సిబ్బంది వెంబడించారన్నారు. ఇరిగిపెంట గ్రామం ఎర్రనాగులపల్లె వద్ద పట్టుకుని కర్ణాటక రాష్ట్రం చింతామణికి చెందిన సయ్యద్ ఆరీఫ్ అహ్మద్‌ను అరెస్ట్ చేసి కారుతో పాటు 255 కేజీల బరువు గల ఎనిమిది ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. ఈ దాడిలో సిబ్బంది చంద్రశేఖర్, ప్రతాప్, నరేష్, చరణ్, దేవేంద్ర పాల్గొన్నారు.