
కమనీయం.. పట్టాభిరాముడి కల్యాణం
కలికిరి(వాల్మీకిపురం) : వేదపండితుల మత్రోచ్ఛాటన.. మంగళ వాయిద్యాల ఘోష.. పురోహితులు... వందిమాగధులు.. పరిచారకులు వెన్నంటి ఉండగా.. కల్యాణ వేదికపై పట్టు వస్త్రాలతో పెళ్లి కొడుకుగా ముస్తాబైన రామచంద్రుడు.. కుడివైపు పెళ్లి వస్త్రాలతో సిగ్గు లొలకబోస్తున్న సీతమ్మ తల్లి.. ఎడమ వైపు లక్ష్మణ స్వామి ఆశీనులయ్యారు. రంగురంగుల పుష్పాలతో అలంకరించిన కల్యాణ వేదికపై సీతారాముల కల్యాణ వైభోగాన్ని వీక్షించిన భక్తజనం పరవశించి పోయారు. పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి అభిషేకం, అర్చన, స్నపన తిరుమంజనం, తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ఊంజల్‌సేవ విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. టీటీడీ అధికారులు, ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు మోసుకు వచ్చి అందజేయగా కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం రాత్రి భోగోత్సవమూర్తులైన శ్రీసీతారామలక్ష్మణులను విశేష రీతిలో అలంకరించి గరుడ వాహనంపై పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కోలాటలు, చెక్కభజనలు, హరికథా కాలక్షేపాలు, లంకాదహనం, బాణసంచా, బళ్లారి వాయిద్యాలు, మహి ళల చలిపిండి దీపారాధనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జెడ్పీటీసీ శ్రీవల్లి, టీటీడీ డిప్యూటీ ఈఓ వరలక్ష్మీ, ఏఈఓ గోపినాథ్, సూపరింటెండెంట్ మునిబాల కుమార్, ఆలయ అధికారి కృష్ణమూర్తి, అర్చకులు కృష్ణప్రసాద్, కృష్ణమూర్తి, భక్తులు పాల్గొన్నారు.
గరుడవాహనంపై ఊరేగిన శ్రీరామచంద్రుడు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

కమనీయం.. పట్టాభిరాముడి కల్యాణం