
సైబర్ నేరగాళ్ల పన్నాగం
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని పున్నాటివారిపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి బసవగారి వినయ్ కుమార్ రెడ్డి అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 42 వేలు కాజేశారు. తమ కుమారుడి అకౌంట్ నుంచి అతనికి తెలియకుండా డబ్బులు డ్రా చేశారని బుధవారం వినయ్ కుమార్ తండ్రి బసవగారి రమణారెడ్డి మండలంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును సంప్రదించారు. నాలుగు విడతలుగా రూ. 42 వేలు విత్ డ్రా చేశారని బ్యాంకు మేనేజర్ గుర్తించారు. తమ కుమారుడు చైన్నెలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడని రమణారెడ్డి తెలిపారు. కాలేజీ ఫీజుకు సంబంధించి డబ్బులు వేయగా మరుసటిరోజే విత్ డ్రా చేసినట్లు మేసేజ్‌లు రావడం గమనించి తమకు చెప్పడంతో బ్యాంకులో నిర్ధారించుకుని సైబర్ నేరగాల బారిన పడినట్లు తెలిసిందన్నారు. తమ ప్రమేయం లేకుండా అకౌంట్‌లో డబ్బులు డ్రా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు బ్యాంకు మేనేజర్‌ను కోరారు.
రూ. 42 వేలు విద్యార్థి
అకౌంట్ నుంచి స్వాహా