
ఇసుకను కొల్లగొట్టారు.. చెట్లను కూల్చేశారు
గుర్రంకొండ : ఇసుకాసురులు ఎంతకై నా తెగిస్తున్నారు. చెరువుల్లో ఇసుక కోసం అడ్డుగా ఉన్న చెట్లను జేసీబీలతో పెకలించేశారు. రూ. లక్ష విలువచేసే చెట్లను చెరువులో నుంచి మాయం చేసిన సంఘటన మండలంలోని తరిగొండ గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో రామానాయిని చెరువు విస్తరించి ఉంది. మండలంలోని ఇది అతిపెద్ద ఇరిగేషన్ చెరువు. ఈ చెరువు నిండి మొరవ పోతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం వైభవంగా చెరువు వద్ద నిర్వహిస్తారు. అంతటి ప్రాశస్త్యమున్న చెరువు ఇసుకాసురుల అక్రమ సంపాదనకు ఆవాసంగా మారింది. ఓవైపు వందలాది లోడ్ల ఇసుకను ఇప్పటికే అక్రమంగా తరలించకు పోగా చెరువులో ఉన్న చెట్ల పై కూడా ఇసుకాసురుల కన్ను పడింది. చెరువుల సువిశాలమైన ప్రాంతంలో పురాతన నల్లతుమ్మ, నీలగిరి చెట్లు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటి మధ్యలో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇసుకాసురులు ఇసుక తోడేందుకు అడ్డుగా ఉన్న నల్లతుమ్మ, నీలగిరి చెట్లను జేసీబీలతో పెకలించి వేశారు. చెరువులోనే మరికొన్నిచోట్ల ఇసుకను తరలించడానికి కొత్త దారుల ఏర్పాటు కోసం చెట్లను జేసీబీలతో పెకలించి పక్కన పడేశారు. కొంతమంది ఇసుకాసురులు వీటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బట్టీల యాజమానులకు సుమారు లక్ష విలువ చేసే నల్లతుమ్మ, నీలగిరి చెట్లను ఇప్పటికే ఇసుకాసురులు విక్రయించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మరికొన్ని చెట్లను వేళ్లతో సహా పెకలించి చెరువుల్లో అలాగే వదిలిపెట్టేశారు. చెరువుల్లో ఎక్కడ చూసినా నేలకొరిగిన చెట్లే దర్శనమిస్తుండడం గమనార్హం. ఓవైపు ఇసుక మరోవైపు చెట్లను అక్రమంగా విక్రయిస్తూ ఇసుకాసురులు లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ కోరగా చెరువులను కాపాడుకునేందుకు ఇప్పటికే వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను అక్కడ కాపలాగా ఉంచామన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇసుక కోసం జేసీబీలతో
చెట్లను తొలగించిన వైనం
రూ.లక్ష విలువ చేసే చెట్లు మాయం

ఇసుకను కొల్లగొట్టారు.. చెట్లను కూల్చేశారు