
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో జిల్లా జట్టుకు మూడో స్థానం
రాయచోటి జగదాంబసెంటర్ : రాష్ట్ర స్థాయి జూనియర్స్ హాకీ పోటీలలో రాజు హాకీ అకాడమీ మూడో స్థానాన్ని కై వసం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా హాకీ సెక్రటరీ ఇ.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు ధర్మవరంలో జరిగాయన్నారు. పోటీలలో రాష్ట్ర స్థాయి జూనియర్స్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అన్నమయ్య జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా హాకీ జట్టును హాకీ ఫౌండర్ సి.చంద్రశేఖర్, కోచ్‌లు సుబ్బు, నారాయణ, రాజి, రాజు విద్యాసంస్థల అధ్యాపకులు అభినందించారు.
అన్నమాచార్య యూనివర్సిటీలో టెక్‌ఫెస్ట్ విజయవంతం
రాజంపేట : రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో జాతీయస్థాయిలో నిర్వహించిన రెండురోజుల సాంకేతిక సాంస్కృతిక మహోత్సవం (టెక్‌ఫెస్ట్–2025) గురువారం విజయవంతంగా ముగిసింది. ముఖ్య అతిథిగా జేఎన్‌టీయూఏ ఇంజినీరింగ్ కాలేజ్, పులివెందుల ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఆత్మవిశ్వాసాన్ని, పోటీతత్వాన్ని పెంపొందించడంతోపాటు సమకాలిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవచ్చన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఈ.సాయిబాబా రెడ్డి మాట్లాడారు. ముగింపు సందర్భంగా పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రోఛాన్సలర్ చొప్పా అభిషేక్ రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.మల్లికార్జున రావు, కళాశాల వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్‌ఎంవి నారాయణ, బి.జయరామిరెడ్డి, డీన్ డాక్టర్ ఎం.సుబ్బారావు, పరిపాలన అధికారి ఎన్.సుబ్బారెడ్డి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
కారులో మంటలు..
వ్యక్తికి తీవ్ర గాయాలు
వీరబల్లి : మండలంలోని షికారుపాలెం వద్ద గురువారం రాత్రి 8 గంటల సమయంలో కారు దగ్ధం కావడంతో అందులోని వ్యక్తికి గాయాలయ్యాయి. రాయచోటి పట్టణంలోని బీరంసాబ్ వీధికి చెందిన మన్నూరు అలీ (53) రాజంపేట నుంచి రాయచోటికి కారులో వస్తుండగా షికారుపాలెం వద్ద ఉన్న మలుపువద్ద అదుపు తప్పడంతో కారు పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కన పడిపోయింది. మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ వరప్రసాద్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన మన్నూరు అలినీ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించినట్లు సమాచారం.

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో జిల్లా జట్టుకు మూడో స్థానం

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో జిల్లా జట్టుకు మూడో స్థానం

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలలో జిల్లా జట్టుకు మూడో స్థానం